Friday, March 29, 2024

త్వరలో తెలంగాణ‌కు ప్రధాని రాక‌.. మల్కాజిగిరిలో రోడ్‌షో ఏర్పాట్లు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : మరికొన్ని నెలల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగనుండడంతో బీజేపీ అగ్రనేతలు తెలంగాణలో వరుస పర్యటనలు నిర్వహించనున్నారు. ఈ సారి సీఎం కేసీఆర్‌ను ఎలాగైనా గద్దె దించాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ఇప్పటికే పలు విధాలుగా, పలు కార్యక్రమాల రూపంలో అధికార బీఆర్‌ఎస్‌ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళుతోంది. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇంటింటికీ ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే ప్రజా సంగ్రామ యాత్ర, స్ట్రీట్‌ కార్నర్‌ మీటింగ్‌లు, టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీపై ఉమ్మడి జిల్లాల కేంద్రంగా నిరుద్యోగ మార్చ్‌ లు నిర్వహిస్తున్న బీజేపనీ తాజాగా ప్రధాని మోడీ పాలనకు తొమ్మిదేళ్లు పూర్తయిన నేపథ్యంలో చేపట్టిన మహాజన సంపర్క్‌ అభియాన్‌ ద్వారా తెలంగాణలో విస్తృతంగా ప్రజల చెంతకు పార్టీని చేర్చేందుకు ప్రణాళికను ఖరారు చేసింది.

జనసంపర్క్‌ అభియాన్‌లో భాగంగా బీజేపీ అగ్రనేతలు తెలంగాణలో వరుస పర్యటనలు నిర్వహించనున్నారు. ఇప్పటికే ఈ నెల 15న ఖమ్మం జిల్లా బహిరంగసభకు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, ఈ నెల 25న నాగర్‌కర్నూలులో నిర్వహించతలపెట్టిన బహిరంగసభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటన ఖరారుగా కాగా త్వరలోనే ప్రధాని మోడీ కూడా తెలంగాణలో పర్యటించనున్నారు. మహాజన్‌ సంపర్క్‌ అభియాన్‌లో భాగంగా ఈ నెలలో మల్కాజిగిరి పార్లమెంట్‌ స్థానం పరిధిలో నిర్వహించే రోడ్‌ షోలో మోడీ పాల్గొనననున్నారు.

కర్ణాటక తరహాలో హైదరాబాద్‌లోనూ ప్రధాని రోడ్‌ షో ఉంటుందని బీజేపీ వర్గాలు తెలిపాయి. మల్కాజిగిరి పరిధిలో నిర్వహించే రోడ్‌షోతోపాటు సికింద్రాబాద్‌ లేదా హైదరాబాద్‌ ఎంపీ నియోజకవర్గం పరిధిలో నిర్వహించే భారీ బహిరంగసభలోనూ ప్రధాని పాల్గొంటారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. కాగా… మహాజన్‌ సంపర్క్‌ అభియాన్‌లో భాగంగా నిర్వహించే బహిరంగసభల్లో … ఈనెల 15న ఖమ్మంలో అమిత్‌ షా, ఈ నెల 25న నాగర్‌కర్నూలు పార్లమెంట్‌ పరిధిలో జరిగే సభలో పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా పాల్గొననున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement