Friday, April 26, 2024

హైదరాబాద్‌కు రానున్న ప్రధాని మోదీ.. ఐఎస్‌బీ స్నాతకోత్సవానికి హాజ‌రు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్‌ పర్యటన షెడ్యూల్‌ను ఎస్‌పీజీ అధికారులు విడుదల చేశారు. మధ్యాహ్నం గం. 1.25కు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి నుంచి హెలికాప్టర్‌లో హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీకి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా గచ్చిబౌలిలోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఐఎస్‌బీ మైస్టాంప్‌, ప్రత్యేక కవర్‌ను విడుదల చేయనున్నారు. స్నాతకోత్సవంలో దాదాపు 900 మంది విద్యార్థులు పాల్గొననున్నారు. గోల్డ్‌ మెడల్‌ సాధించిన విద్యార్థులకు ప్రధాని రతకాలను అందజేస్తారు. కార్యక్రమం అనంతరం సాయంత్రం గం. 3.55లకు ఐఎస్‌బీ నుంచి మోడీ తిరుగు ప్రయాణం కానున్నారు. మోడీ రాక నేపథ్యంలో బేగంపేట విమానాశ్రయాన్ని, ఐఎస్‌బీ ప్రాంగణాన్ని ఎస్పీజీ సిబ్బంది పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుంది. భద్రతలో పాల్గొనే సిబ్బందికి అధికారులు కోవిడ్‌ పరీక్షలు నిర్వహించారు. ప్రధాన మంత్రి ఐఎస్‌బీ వెళ్ళేందుకు హెలికాప్టర్‌ను సిద్దం చేసినప్పటికీ అత్యవసర పరిస్థితులలో ప్రత్యామ్నాయంగా రోడ్డు మార్గాన్ని కూడా అధికారులు సిద్దం చేశారు. బేగం పేట విమానాశ్రయం నుంచి ఐఎస్‌బీ వరకు పీఎంవో భద్రతా విభాగం ట్రయల్‌ రన్‌ నిర్వహించింది.

డ్రోన్ల నిషేధం

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. బేగంపేట విమానాశ్రయంతో పాటు పరిసర ప్రాంతాలలో దాదాపు అయిదు వందల మంది పోలీసులతో బందోబస్తును ఏర్పాటు చేయగా, ఐఎస్‌బీలో దాదాపు 2 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఐఎస్‌బీకి 5 కిలోమీటర్ల పరిధిలో రిమోట్‌ కంట్రోల్‌ డ్రోన్ల వాడకంపై నిషేధం విధించారు. ప్యారారైడింగ్‌, మెక్రోలైట్‌ ఎయిర్‌ క్రాఫ్ట్స్‌పై నిషేధం విధించిన పోలీసులు నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రధాని పర్యటన సందర్భంగా ముందుగా అనుమతించిన డ్రోన్లను వినియోగించుకునేందుకు వీలు కల్పించారు. ఈ ఆంక్షలు గురువారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం గం. 6 వరకు అమలులో ఉంటాయని పేర్కొన్నారు.

ట్రాఫిక్‌ ఆంక్షలు

గచ్చిబౌలి స్టేడియం నుంచి విప్రో కూడలి వరకు ఉన్న కంపనీలకు పోలీసులు పలు సూచనలు చేశారు. పని వేళల్లో మార్పులు చేసుకోవాలని ఐటీ కంపనీలకు సూచించారు. గచ్చిబౌలి కూడలి నుంచి లింగంపల్లి వైపు వెళ్ళే వాహనాలను బొటానికల్‌ గార్డెన్‌ నుంచి హెచ్‌సీయూ డిపో మీదుగా వెళ్ళాలని సూచించారు. విప్రో కూడలి నుంచి గచ్చిబౌలి వైపు వెళ్ళే వాహనాలు బొటానికల్‌ గార్డెన్‌ నుంచి హెచ్‌సీయూ డిపో మీదుగా వెళ్ళాలి. లింగంపల్లి నుంచి గచ్చిబౌలి వైపు వెళ్ళే వాహనాలు హెచ్‌సీయూ డిపో నుంచి బొటానికల్‌ గార్డెన్‌ మీదుగా వెళ్ళాలి. విప్రో కూడలలి నుంచి లింగంపల్లి వైపు వెళ్ళే వాహనాలు క్యూసిటీ, గౌలిదొడ్డి నుంచి నల్లగండ్ల మీదుగా వెళ్ళాల్సి ఉంటుంది. విప్రో కూడలి నుంచి గచ్చిబౌలి వైపు వెళ్ళే వాహనాలు ఫెయిర్‌ఫీల్డ్‌ హోటల్‌ నుంచి ఎల్‌ అండ్‌ టీ టవర్స్‌ వైపు వెళ్ళాల్సి ఉంటింది. తీగల వంతెన నుంచి గచ్చిబౌలి కూడలి వైపు వెళ్ళే వాహనాలు మాదాపూర్‌ పీఎస్‌ నుంచి బొటానికల్‌ గార్డెన్‌ మీదుగా వెళ్ళాలని సూచించారు.

- Advertisement -

ప్రధాని పర్యటన సాగనుంది ఇలా…

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేక విమానం మధ్యాహ్నం గం. 1.25 లకు బేగంపేట విమానాశ్రయంలో ల్యాండ్‌ కానుంది. మధ్యాహ్నం గం. 1.30లకు ప్రధాన మంత్రి హెలిపాడ్‌కు చేరుకుంటారు. వెంటనే హెలికాప్టర్‌లో బయలు దేరి గం. 1.50 కి హెచ్‌సీయూలో ఏర్పాటు చేసిన ప్రత్యేక హెలిపాడ్‌లో దిగనున్నారు. అక్కడి నుంచి గం. 1.55 కు రోడ్డు మార్గం ద్వారా ఐఎస్‌బీకి బయలుదేరి అయిదు నిమిషాల్లో అంటే మధ్యాహ్నం గం. 2 లకు ఐఎస్‌బీ ప్రాంగణానికి చేరుకోనున్నారు. మధ్యాహ్నం గం. 2 నుంచి గం. 3.15 వరకు ఐఎస్‌బీలో జరిగే స్నాతకోత్సవం కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించడంతో పాటు ఐఎస్‌బీ కవర్‌, స్టాంప్‌ను కూడా విడుదల చేయనున్నారు. గం. 3.20కి ఐఎస్‌బీ నుంచి రోడ్డు మార్గం ద్వారా బయలు దేరి గం. 3.25కు హెచ్‌సీయూలోని హెలిపాడ్‌కు చేరుకుంటారు. గం. 3.30లకు హెలికాప్టర్‌లో బయలుదేరి గం. 3.50 కి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. గం. 3.55లకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి చెన్నై వెళ్ళనున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement