Friday, March 29, 2024

ఈనెల 28న హైదరాబాద్‌కు రాష్ట్రపతి ముర్ము.. శీతాకాల విడిదిలో భాగంగా రాక

ఆంధ్రప్రభ, హైదరాబాద్‌: దక్షిణాది విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్కు రాష్ట్రానికి రానున్నారు. ఏటా డిసెంబర్‌ మాసం చివర్లో హైదరాబాద్‌లోని బొల్లారం రాష్ట్రపతి నిలయానికి రావడం సాంప్రదాయంగా వస్తోంది. కాగా, గడచిన రెండేళ్లలో కోవిడ్‌ కారణంగా రాష్ట్రపతి దక్షిణాది విడిదికోసం రాలేదు. తాజాగా రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపదీ ముర్కు దక్షిణాది విడిదికి రానున్నట్లు తెలిసింది. ఈ నెల 28న రాష్ట్రానికి రానున్న ఆమె మూడు రోజులపాటు హైదరాబాద్‌లో బస చేయనున్నారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో మూడు రోజులపాటు బస చేసే రాష్ట్ర్రపతి ఇక్కడినుంచే దక్షిణాది రాష్ట్రాల్లో పలు అధికారిక కార్యక్రమాలకు పాల్గొనేందుకు వెళ్తారు.

చివరగా 2019లో అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ దక్షిణాది విడిదిలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చారు. ఆ తర్వాత కోవిడ్‌ మహమ్మారి కారణంగా ఈ కార్యక్రమం రద్దవుతూ వచ్చింది. తాజాగా రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపదీ ముర్కు దక్షిణాది విడిది కోసం రాష్ట్రానికి రానున్నట్లు రాష్ట్రపతి భవన్‌ వర్గాలు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించాయి. అయితే పూర్తిస్థాయి షెడ్యూల్‌ ఇంకా ఖరారు కానప్పటికీ ఆమె రాక ఖాయమని చెబుతున్నారు. ఈ నెల 28న హైదరాబాద్‌కు వచ్చి 30న ఢిల్లిdకి తిరిగి వెళతారని సమాచారం. 90 ఎకరాల సువిశాల స్థలంలో ఆమె బస చేశారు. రాష్ట్రపతి ముర్కు ఢిల్లి నుంచి ప్రత్యేక విమానంలో దుండిగల్‌ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడినుంచి బొల్లారం వెళ్లడం ఆనవాయితీ. ఇందుకు సంబంధించి ప్రోటోకాల్‌ విభాగం ఏర్పాట్లు చేయనుండగా, ఆక్టోపస్‌, ఇంకా ఇతర కేంద్ర బలగాలు పర్యవేక్షణ, భద్రత చర్యల్లో పాల్గొంటాయి.

బొల్లారంలోని రాష్ట్రపతి నిలయాన్ని 25వేల చదరపు అడుగుల్లో నిర్మించారు. దట్టమైన చెట్లతో పచ్చటి ప్రకృతి ఒడిలో రాష్ట్రపతి భవన్‌ విలసిల్లుతోంది. ఈ భవనాన్ని బ్రిటీష్‌ పాలనలో అప్పటి వైస్రాయ్‌ నివసించేందుకు వీలుగా నిర్మించారు. 20కిపైగా గదులతో విశాలంగా ఉండే ఈ భవనంలో సకల సదుపాయాలున్నాయి. కాలక్రమేణా అప్పట్లో ఈ భవనాన్ని నిజాం ప్రభువులు స్వాధీనంలోకి తీసుకోగా, 1950లో కేంద్ర ప్రభుత్వం ఈ భవనాన్ని రూ. 60లక్షలకు కొనుగోలు9 చేసింది. ఆ తర్వాత దక్షిణాది విడిదిగా కేటాయించారు. సాధారణ సమయాల్లో రాష్ట్రపతి నిలయంలోకి సామాన్యులకు ప్రవేశం ఉండదు. కానీ ప్రతీఏడాది శీతాకాల విడిది తర్వాత వారంరోజులపాటు రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించేందుకు అనుమతిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement