భద్రాచలం : భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భద్రాద్రి రామయ్యను దర్శించుకున్నారు. ప్రధాన ఆలయంలో శ్రీసీతారామచంద్ర స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆలయానికి చేరుకున్న రాష్ట్రపతికి ఆలయ వేద పండితులు, ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనానంతరం రాష్ట్రపతికి అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. శ్రీలక్ష్మి తాయారు అమ్మవారి ఆలయంలో వేద పండితుల చేత వేదాశీర్వచనం అందించి స్వామివారి జ్ఞాపిక శాలువాతో రాష్ట్రపతిని ఆలయ అర్చకులు ఘనంగా సత్కరించారు. భద్రాద్రి రామయ్య సన్నిధిలో భారత రాష్ట్రపతికి సీతారామచంద్ర స్వామి వారి జ్ఞాపికను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అందజేశారు. అనంతరం రామాలయంలో ఏర్పాటు చేసిన ప్రసాద్ పథకంలో భాగంగా సుమారు రూ.41 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనుల శిలాఫలకాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆవిష్కరించారు. ఆమెవెంట గవర్నర్ తమిళిసై, మంత్రులు పువ్వాడ అజయ్, సత్యవతి రాథోడ్ ఉన్నారు.
