Tuesday, March 26, 2024

శ్రీలంకలో పెట్రో కోటా.. వారంలో రెండు రోజులు మాత్రమే సరఫరా

ఇంధనం కొరతతో అల్లాడుతున్న శ్రీలంక జాతీయ పెట్రో కోటా పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. ఇంధన శాఖ మంత్రి కంచన విజేశేఖర శనివారం నేషనల్‌ ఫ్యూయల్‌ పాస్‌ పేరిట పెట్రో కోటా పథకాన్ని ప్రారంభించారు. నేషనల్‌ ఐడెంటిటీ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి సమానంగా పెట్రోల్‌, డీజిల్‌ వంటివి సరఫరా చేసేందుకు ఈ పథకం వీలు కల్పిస్తుంది. వాహనాలున్న వినియోగదారులకు వారంలో రెండు రోజుల పాటు పెట్రోల్‌, డీజిల్‌ తీసుకునేందుకు అవకాశం కల్పించారు. వారి వాహనం ఛాసీ నెంబర్‌ను పరిశీలించాక క్యూఆర్‌ కోడ్‌ ఇస్తారని, వివరాలన్నీ పరిశీలించాక నెంబర్‌ ప్లేట్‌పైనున్న చివరి అంకెను పరిగణనలోకి తీసుకుని కోటా కేటాయిస్తారు. జాతీయ గుర్తింపుకార్డు ఉంటేనే ఈ కోటా వర్తిస్తుంది. కొలంబోలో పర్యాటకులు, విదేశీయులకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వనున్నారు. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో సతమతమవుతున్న శ్రీలంకలో నిన్నమొన్నటి వరకు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులున్నాయి. ఇంధనం కొనుగోలు చేసే ఆర్థిక స్తోమత కూడా లేని స్థితిలో రాజకీయ సంక్షోభం ముంచుకొచ్చింది. ప్రజల తిరుగుబాటు నేపథ్యంలో దేశాధ్యక్షుడు గొటబాయ రాజపక్స దేశం విడిచి వెళ్లడంతో ప్రస్తుతం పరిస్థితులు చక్కబడుతున్నాయి. అయితే, ఆర్థిక కష్టాలు మాత్రం అలాగే ఉన్నాయి. ప్రత్యేకించి పెట్రోల్‌, డీజిల్‌, కిరోసిన్‌, గ్యాస్‌ కొరత తీవ్రంగా వేధిస్తోంది. రోజుల తరబడి క్యూలో ఉంటేనే గాని అవి దొరకడం లేదు. పైగా ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పెట్రోల్‌, గ్యాస్‌ స్టేషన్ల వద్ద కిలోమీటర్ల పొడవున ప్రజలు బారులు తీరుతున్నారు. ఈ పరిస్థితుల్లో పెట్రో కోటా పథకాన్ని అమలు చేయాలని శ్రీలంక ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి ఒక్కరికి సరిసమానంగా ఇంధనం అందించడం, నల్లబజారులో విక్రయాలను నిర్మూలించడం లక్ష్యంగా శ్రీలంక ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకువస్తోంది. దేశంలో తీవ్ర ఇంధన కొరత నేపథ్యంలో విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోయింది. రోజుకు 12 గంటలకుపైగా విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలను మూసివేశారు. ప్రభుత్వ ఉద్యోగులను ఇంటినుంచే పనిచేయమని ఆదేశించారు. ఈ స్థితిలో కోటా పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చారు.

ఇండియా ఒక్కటే ఆదుకుంటోంది- మంత్రి కాంచన విజయశేఖర
ఇంధన కొరతతో అల్లాడుతున్న తమ దేశానికి భారత్‌ పెద్దఎత్తున సహాయం చేస్తోందని, క్రెడిట్‌లైన్‌ విధానంలో ఇంధన సరఫరాకు అంగీకరించిన దేశం భారత్‌ ఒక్కటేనని ఆ దేశ ఇంధన శాఖ మంత్రి కాంచన విజేశేకర చెప్పారు. రష్యాతో సహా చాలా దేశాలను ఇంధనం సరఫరా చేయాలని కోరామని, ఇప్పటివరకు భారత్‌ మాత్రమే సానుకూలంగా స్పందించిందని శనివారం చెప్పారు. రష్యానుంచి పెద్దఎత్తున చమురు దిగుమతికి సంప్రదింపులు జరుపుతున్నామని, అయితే ఆ దేశం నుంచి ఇంకా ఎటవంటి నిర్ణయం వెలువడలేదని చెప్పారు. శ్రీలంకలో ఆర్థిక, రాజకీయ సంక్షోభం నెలకొన్న సమయంలో అనేకమార్లు భారత్‌ అండగా నిలిచింది. దాదాపు 3 బిలియన్‌ డాలర్ల విలువైన ఇంధనం, ఆహార పదార్థాలు, ఔషధాలు, ఇతర నిత్యావసర సరుకులు సరఫరా చేసింది.

డాలర్లలో ప్రవాస శ్రీలంకేయుల వితరణ
ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న దేశాన్ని ఆదుకునేందుకు ప్రవాస శ్రీలంకేయులు ముందుకొస్తున్నారు. దేశాధ్యక్షుడు గొటబాయ రాజపక్స దేశాన్ని విడిచివెళ్లిన తరువాత పెద్దసంఖ్యలో ప్రవాసులు విరాళాలు అందజేస్తున్నారు. డాలర్లలో ఆ మొత్తాన్ని జమ చేస్తూండటం విశేషం. స్వదేశానికి డబ్బు పంపాలనుకునేవారు డాలర్లలో, అధికారిక మార్గాల్లో మాత్రమే పంపాలని సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ శ్రీలంక ప్రకటించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement