Monday, April 15, 2024

బెల్ ఫ్యాక్టరీకి అనుమతులు, బడ్జెట్ కేటాయింపు.. త్వరితగతిన పనులు ప్రారంభం : బెల్ డైరక్టర్ పార్థసారథి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సత్యసాయి జిల్లా పాలసముద్రం వద్ద ‘భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్’ ఫ్యాక్టరీ నిర్మాణానికి అన్ని అనుమతులు, బడ్జెట్ కేటాయింపులు జరిగాయని ఆ సంస్థ ఇండిపెండెంట్ డైరక్టర్ డా. పార్థసారథి తెలిపారు. 2016లో రక్షణ అవసరాల కోసం క్షిపణుల తయారీ, రాడార్లు టెస్ట్ చేయడం కోసం సత్యసాయి జిల్లా పాలసముద్రం దగ్గర 914 ఎకరాల్లో ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. కానీ భూమి కన్వర్షన్, పర్యావరణ అనుమతులు వచ్చేసరికి నాలుగేళ్ల సమయం పట్టింది. ఆపై కరోనా కారణంగా మరింత ఆలస్యం జరిగింది. ఈ భూమి ఏపీఐఐసీ కేటాయించడం వల్ల ప్రాజెక్టు చెప్పిన సమయంలోగా ప్రారంభం కాలేదు కాబట్టి నిబంధనల ప్రకారం భూమిని వెనక్కు ఇవ్వాలని పేర్కొంది. అదేవిధంగా రూ. 5 కోట్ల పెనాల్టీ కూడా విధించింది. ఇలాంటి అనేక ఆంక్షల నడుమ ఫ్యాక్టరీ నిర్మాణం మొదలవలేదని డా. పార్థసారథి తెలిపారు. తద్వారా బడ్జెట్ కేటాయింపులు కూడా సాధ్యం కాలేదని అన్నారు.

2022లో  కొన్ని నిబంధనలు మారిస్తే ఫ్యాక్టరీ నిర్మాణం చేపడతామని, బడ్జెట్ ఇస్తామని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ప్రతినిధులతో కలిసి తాను ఏపీఐఐసీ అధికారులను కలిసి విజ్ఞప్తి చేశానని చెప్పారు. నిబంధనలను సవరించడం ద్వారా ఫ్యాక్టరీ ఏర్పాటు సాధ్యమవుతుందని , ముందుగా అనుకున్న దానికంటే పెద్ద స్థాయిలో ఫ్యాక్టరీ నిర్మిస్తామని, పెద్ద ఎత్తున ఉద్యోగాలు సృష్టించడం సాధ్యమవుతుందని, అలాగే చుట్టుపక్కల కూడా మరెన్నో ఫ్యాక్టరీలు అనుబంధంగా వచ్చే అవకాశం ఉందని వివరించినట్టు తెలిపారు. వెనుకబడిన రాయలసీమ ప్రాంతానికి ఇది ఒక ఆశా కిరణమవుతుంది, ఆ ప్రాంతంలో అభివృద్ధి జరుగుతుందని వివరించినట్టు చెప్పారు. ఆ మేరకు ఏపీఐఐసీ సానుకూలంగా స్పందించి నిబంధనలు, ఆంక్షలు సడలించిందని తెలిపారు. దాంతో రక్షణ శాఖ అనుమతులతో పాటు కంపెనీ పత్రాలు సిద్ధం చేసింది.

- Advertisement -

శనివారం ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నంలో భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ – ఇన్వెస్ట్మెంట్ కమిటీ తన అధ్యక్షతన సమావేశమై పాలసముద్రంలో చేపట్టబోయే ఫ్యాక్టరీ మొదటి దశ నిర్మాణం కోసం రూ. 384 కోట్ల నిధులు మంజూరు చేసినట్టు పార్థసారథి వెల్లడించారు. అలాగే ముందు అనుకున్నట్టుగా మిసైల్ తయారీ, రాడార్ టెస్టింగ్ తో పాటుగా మరిన్ని అత్యాధునిక రక్షణ రంగ ఉత్పత్తులను తయారు చేసే ‘డిఫెన్స్ సిస్టమ్స్ ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్’ గా తీర్చిదిద్దాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. ఇక ఏమాత్రం ఆలస్యం కాకుండా వెంటనే టెండర్లు పిలిచి పని మొదలు పెట్టాలని ప్రతి 6 నెలలకు ఒకసారి జరుగుతున్న పురోగతిపై సమీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్టు ఆయన వెల్లడించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement