Tuesday, March 21, 2023

నల్గొండ ప్లోరైడ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం.. తిరిగి ప్రారంభంకానున్న ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పనులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: అవాంతరాలను అధిగమించి శ్రీశైలం ఎడవగట్టుకాలువ సొరంగ మార్గం నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ఈ సొరంగ మార్గం నిర్మాణంలో ఉత్పన్నమైన సమస్యలను పరిష్కరించి, నిధులు సమకూర్చి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. 2024 డిసెంబర్‌ నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో నీటి పారుదల శాఖ అడుగులు ముందుకు వేసింది. నల్లమల అడవుల్లోంచి పర్యావరణానికి నష్టం కలగకుండా నిర్మించనున్న ఈ సొరంగ మార్గం ప్రపంచంలో 5వ అతిపెద్ద సాగునీటి సొరంగా కీర్తిని మూటకట్టుకోనుంది. ఇంజనీరింగ్‌లో మరో అద్భుతంగా ఈ సొరంగ మార్గం నిర్మాణం నిలిచిపోనుంది. 43.931 కిలోమీటర్ల పొడవు, 9.2 మీటర్ల వ్యాసార్థంతో సొరంగ మార్గాన్ని ఐదేళ్లక్రితం వరకు తవ్వి భౌగోళిక, ఆర్థి, కార్మికుల సమ్మెతో అర్ధంతరంగా నిలిచిపోయిన సొరంగ మార్గం తవ్వకాలు ప్రారంభించేందుకు పనులు కొనసాగుతున్నాయి. శ్రీశైలం జలాశయం నక్కల గండి రిజర్వాయర్‌ నుంచి నీటిని తీసుకువెళ్లడానికి ఈ సొరంగ మార్గాన్ని 2007లో నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ప్రారంభించారు.

ఆనాటి అంచనావ్యయం రూ.1,925 కోట్లు ఉండగా ప్రస్తుతం సవరించిన అంచనాల మేరకు రూ.3,152,72 కోట్లకు చేరుకుంది. అయితే ఇంజనీరింగ్‌ డిజైన్‌ మార్చి సొరంగం ద్వారా కృష్ణా జలాలు కరవుపీడిత, ప్లోరైట్‌ ప్రాంతాల్లో సాగు, తాగునీరు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం పనులు చేపట్టింది. గత ఐదేళ్ల క్రితం ఈ ప్రాజెక్టులో పనిచేస్తున్న జార్ఖండ్‌, బీహార్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌ కార్మికులు సమ్మెచేయడంతో పనులు నిలిచిపోయాయి. అలాగే పెండింగ్‌ బిల్లుల కోసం తెలంగాణ సదరన్‌ పవర్‌ పంపిణీ సంస్థ సరఫరా నిలిపివేయడం, సొరంగ మార్గం మధ్యలో యంత్రాలు మొరాయించడం, టన్నెల్‌లో నీరు చేరడంతో పనులు నిలిచి పోయాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ నీటిపారుదల, విద్యుత్‌ అధికారులు, సంబంధిత శాఖల మంత్రులతో సమావేశమై పనులు ప్రారంభించేందుకు నిధుల సమస్యలను పరిష్కరించారు.

- Advertisement -
   

శ్రీశైలం ఆనకట్ట కొద్ది దూరంలో ఈగల్‌పెంట దగ్గర నుంచి ప్రారంభమైన ఈ సొరంగ మార్గం దేవరకొండ సమీపంలోని అంగడిపేట్‌ గ్రామం వరకు నిర్మిస్తారు. అనంతరం కాలువల ద్వారా రిజర్వాయర్లకు నీటి సరఫరా, పంటకాలువల ద్వారా సాగుభూములకు నీటి సరఫరా చేస్తారు. ఈ సొరంగం పూర్తి అయితే నల్గొండ జిల్లాలో 3.5 లక్షల ఎకరాలకు సాగునీరు, 500 గ్రామాలకు పైగా సాగునీరు అందనుంది. వైఎస్‌అర్‌ ఈ ప్రాజెక్టును ప్రారంభించినప్పటికీ సమస్యలను పరిష్కరించక పోవడంతో పనుల్లో జాప్యం జరిగింది. అలాగే పర్యావరణ శాఖ తొలుత ఈ ప్రాజెక్టుకు నిరాకరించినప్పటికీ ఆతర్వాత డిజైన్‌ మార్చి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు సాధించింది. భూసేకరణ సమస్య ఉత్పన్నం కాకుండా భూగర్భం నుంచి నిర్మిస్తున్న ఈ భారీ సొరంగ మార్గం పూర్తి అయితే నల్గొండలో శతాబ్దాల తరబడి ప్రజల బతుకులను చిదమి వేస్తున్న ప్లోరైడ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. ఈ మేరకు సీఎం కేసీఆర్‌ ఈ ప్రాజెక్టు పనులను పరిశీలించి ఎట్టి పరిస్థితుల్లోనైనా పూర్తి చేయాలని నీటి పారుదలశాఖ అధికారులను ఆదేశించారు.

అయితే ఇప్పటివరకు ఈ ప్రాజెక్టుకు రూ.2,355.90 కోట్ల ఖర్చు అయింది. అయితే తిరిగి పనులు ప్రారంభించేందుకు సవరించిన అంచనాల మేరకు రూ.3,152,72 కోట్లకు అనుతించడంతో పనులు ప్రారంభించేందుకు సంబంధత శాఖలు ముందుకు కదిలాయి, ఈనెల చివరిలోగా పనులు ప్రారంభించి డిసెంబర్‌లోగా పూర్తి చేయాలని నీటి పారుదలశాఖ సంబంధిత గుత్తేదారులను ఆదేశించింది. ప్రస్తుతం ఉన్న యంత్రాలు గంటకు 1.5 మీటర్లు సొరంగాన్ని తవ్వగలుగుతుంది. అయితే యంత్రాలను కూడా ఆధునీకరించి పురోగతి సాధించాలని ప్రభుత్వం ఆదేశించింది. 43.931 కిలోమీటర్ల పొడవుగల సొరంగమార్గం ప్రస్తుతం 34.37 కిలోమీటర్లు పూర్తి అయినప్పటికీ సొరంగంలో నీళ్లు చేరుకుని పనులకు ఆటంకం కలిగించడంతో నీటిని తోడి లైనింగ్‌ పనులు జరుగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement