Monday, April 15, 2024

Delhi | పనితీరే గెలిపించింది, 15 ఏళ్లలో ఏం చేసిందో బీజేపీ చెప్పుకోలేకపోయింది.. ఆప్ నేతలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వంలో కొలువైన ఆమ్ ఆద్మీ పార్టీ పనితీరే మున్సిపల్ ఎన్నికల్లో విజయాన్ని అందించిందని ఆ పార్టీ తెలిపింది. 15 ఏళ్లుగా మున్సిపాలిటీల్లో పాగా వేసిన బీజేపీ, ప్రజలు ఏం చేసిందో చెప్పుకోలేపోయిందని ఆప్ నేతలు వ్యాఖ్యానించారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో 250 వార్డులకు 134 వార్డుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపొందింది. ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత ఆ పార్టీ నేతలు జశ్వంత్ రెడ్డి, విజయ్ మల్లంగి మీడియాతో మాట్లాడారు. ఆమ్ ఆద్మీ పార్టీని పనితీరే గెలిపించిందని వారిద్దరూ సూత్రీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని పాఠశాలలు, ఆస్పత్రులను మెరుగుపర్చడంతో పాటు సామాన్యులు ఎదుర్కొనే అనేక ఇతర సమస్యలను ఆప్ సర్కారు పరిష్కరించిందని, అయితే ఇంతకాలం పాటు మున్సిపాలిటీలు బీజేపీ చేతిలో ఉండడంతో అక్కడ ఏమీ చేయలేకపోయిందని విజయ్ అన్నారు.

ఎక్కడి చెత్త అక్కడ పేరుకుపోయి ఢిల్లీ మురిగి నగరంగా మారిందని, ఢిల్లీ ప్రజలు ఇది గ్రహించి రాష్ట్రంలోనే కాదు, మున్సిపల్ కార్పొరేషన్లోనూ ఆమ్ ఆద్మీ పార్టీనే గెలిపించాలని నిర్ణయించుకున్నారని ఆయన తెలిపారు. అందుకే ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా చెప్పుకునే బీజేపీని చిన్న పార్టీ ఆప్ ఓడించిందని ఆయన ఎద్దేవా చేశారు. ఈ పరిస్థితుల్లో పరిశుభ్రమైన ఢిల్లీని అందజేస్తామంటూ తాము ఎన్నికల్లో ప్రచారం చేశామని, తాము ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటామన్న నమ్మకం ప్రజల్లో ఉంది కాబట్టే తమకు ఓటేసి గెలిపించారని సూత్రీకరించారు. వీటితో పాటు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సమస్యలైన పార్కింగ్, వీధి వ్యాపారులకు లైసెన్సుతో పాటు ప్రత్యేక స్థలం, ఇన్‌స్పెక్టర్ల వసూళ్ల రాజ్యం వంటివాటిని ఎలా పరిష్కరిస్తామో ప్రజలకు వివరించామని తెలిపారు.

తమ పనితీరు చూసి ఓటేయమని కోరామని, ఈ క్రమంలో ఒక్క రూపాయి కూడా ఓటర్లకు పంచలేదని అన్నారు. కానీ బీజేపీ మాత్రం 15 ఏళ్ల కాలంలో ఏం చేసిందో చెప్పుకోలేక ఒక్క ప్రధాని మినహా మిగతా జాతీయస్థాయి నేతలందరినీ ప్రచారంలో రంగంలోకి దిపిందని, వారిని చూసి ఓటేయాల్సిందిగా కోరిందని ఎద్దేవా చేశారు. కానీ ప్రజలు మాత్రం రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీయే కావాలని కోరుకున్నారని, అందుకే ఢిల్లీ నగర మేయర్‌ పీఠంపై ఆమ్ ఆద్మీని కూర్చోబెట్టారని విజయ్ సూత్రీకరించారు.

హైదరాబాద్‌కు చెందిన జశ్వంత్ రెడ్డి, కడపకు చెందిన విజయ్ మల్లంగి వృత్తిరీత్యా ఐటీ నిపుణులు. అమెరికాలోని కాలిఫోర్నియాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. అయితే గత కొన్నేళ్లుగా ఆమ్ ఆద్మీ పార్టీ చేస్తున్న కార్యకలాపాలు, పాలన చూసి స్ఫూర్తి పొందారు. దీంతో అమెరికాను వదిలి ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నారు. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల వార్ రూమ్ ఇంచార్జులుగా, కోఆర్డినేటర్లుగా పనిచేశారు. 250 వార్డుల్లో అనేకచోట్ల ప్రచార కార్యక్రమాలు రూపొందించి, ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం తెలుగు మీడియాతో మాట్లాడి తమ అభిప్రాయాలు, విశ్లేషణ అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement