Thursday, March 28, 2024

పవన్ ముసుగు తొలగిపోయింది.. బాబును సీఎం చేయడం కోసం బట్టలు చించుకుంటున్నారు : కారుమూరు నాగేశ్వరరావు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముసుగు తొలగిపోయిందని, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడితో ఉన్న అనుబంధం బహిర్గతమైందని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరు నాగేశ్వరరావు అన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన సోమవారం ఏపీ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్రంలో పొత్తులపై జరుగుతున్న చర్చపై స్పందించారు. వైఎస్సార్సీపీ వ్యతిరేక ఓటు చీల్చకుండా చూడాలన్న పవన్ కళ్యాణ్ మాటల్లోని ఆంతర్యం అందరికీ అర్థమైందని, చంద్రబాబును సీఎంను చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. ఎవరెన్ని పొత్తులు పెట్టుకున్నా, ఎన్ని పార్టీలు పొత్తులు పెట్టుకున్నా వైఎస్సార్సీపీ గెలుపును ఎవరూ అడ్డుకోలేరని వ్యాఖ్యానించారు. జగన్ సింహంలాంటోడని, సింహం సింగిల్‌గానే వస్తుందని కారుమూరు వ్యాఖ్యానించారు. వైఎస్సార్సీపీ గతంలోనూ పొత్తులు పెట్టుకోలేదని, భవిష్యత్తులోనూ పెట్టుకోబోదని స్పష్టం చేశారు. జగన్‌ను ఒంటరిగా ఎదుర్కోలేకనే అన్ని పార్టీలూ పొత్తుల ప్రస్తావన తీసుకొస్తున్నాయని వ్యాఖ్యానించారు. అలాగే ముందస్తు ఎన్నికల ఊహాగానాలను ఆయన కొట్టిపడేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ముందస్తు ఎన్నికలు జరగవని, టర్మ్ పూర్తయ్యాకనే ఎన్నికలు జరుగుతాయని వెల్లడించారు.

ఢిల్లీ నాయకత్వం ముందు జగన్ సాగిలపడుతున్నారంటూ తెలుగుదేశం చేస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ ఢిల్లీని ఎదిరించిన వ్యక్తి జగన్ అన్నారు. చంద్రబాబు నాయుడే సోనియా గాంధీ, బీజేపీ నాయకత్వం, పవన్ కళ్యాణ్ కాళ్లు పట్టుకున్నారని, అధికారం కోసం ఆయన ఎవరి కాళ్లైనా పట్టుకుంటారని అన్నారు. చంద్రబాబు హయాంలో అనుచరగణానికి మాత్రమే న్యాయం జరిగేదని, జగన్ హయాంలో పార్టీలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని వ్యాఖ్యానించారు. అన్ని వర్గాల ప్రజల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న జగన్‌ను గద్దె దించడం కోసం బాబు అనుచరగణం కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా, ప్రజల అండదండలు, దీవెనలు జగన్ వెంట పుష్కలంగా ఉన్నాయని కారుమూరు నాగేశ్వరరావు అన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement