Thursday, April 25, 2024

ప్రజల్లో పవన్‌ కల్యాణ్‌ గ్రాఫ్‌ పెరిగింది.. పవన్‌ పేరు చెబితే జ‌గ‌న్‌ భయపడుతున్నారు..

అమరావతి, ఆంధ్రప్రభ: జీవో 217తో మత్స్యకారుల జీవితాలను అతలాకుతలం చేసిన ముఖ్యమంత్రికి వారి సంక్షేమం గురించి, పవన్‌ కల్యాణ్‌ గురించి మాట్లాడే అర్హత లేదని జనసేన పార్టీ అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్‌ స్పష్టం చేశారు. మూడేళ్లుగా మత్స్యకారుల గురించి పట్టని ముఖ్యమంత్రి నేడు మాట్లాడుతున్నారంటే అందుకు పవన్‌ కల్యాణ్‌ కారణమన్నారు. మత్స్యకార భరోసా వ్యవహారంలో వేల కుటు-ంబాలను మోసం చేసిన ఈ ప్రభుత్వానిది ప్రచారార్భాటమేన్నారు. ప్రజల్లో జగన్‌ గ్రాఫ్‌ పడిపోయి పవన్‌ కల్యాణ్‌ గ్రాఫ్‌ పెరగడం వల్లే ముఖ్యమంత్రికి భయం పెరిగిందన్నారు. మరోసారి పవన్‌ కల్యాణ్‌ను దత్తపుత్రుడని సంబోధిస్తే జనసైనికుల అగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు. శనివారం విజయవాడలో మరో అధికార ప్రతినిధి అక్కల రామ్మోహన్‌ రావుతో కలిసి మహేష్‌ మీడియా సమావేశం నిర్వహించారు. మత్స్యకారుల సంక్షేమం మీద సీఎంకు ప్రేమ ఉంటే జీవో 217ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. మత్స్యకార భరోసాకు రాష్ట్ర వ్యాప్తంగా లక్షా 60 వేల మందికిపైగా అర్హులుంటే లక్ష మందికే ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు.

మత్స్యకారులకు నిర్మించి ఇస్తామన్న జెట్టీ-లు మూడేళ్లలో ఎన్ని నిర్మించారో చెప్పాలన్నారు. కేంద్రం ఇచ్చే డీసీ వెసెల్‌ బోట్లు- రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తీసుకోవడం లేదో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం చెబుతున్నట్లు 95 శాతం మేనిఫెస్టో అమలు చేస్తే ఆందోళనలు ఎందుకు జరుగుతాయని ప్రశ్నించారు. గడపగడపకు వైసీపీ ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజలు గుద్దుడే గుద్దుడు అంటూ వెనక్కి పంపుతున్నారని మహేష్‌ ఎద్దేవా చేశారు. అందుకే 140 మంది ఎమ్మెల్యేలు ఇళ్లకే పరిమితమయ్యారన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే ఆత్మహత్య చేసుకున్న 3 వేల మంది కౌలు రైతులకు రూ. 7 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అక్కల రామ్మోహన్‌ మాట్లాడుతూ వ్యక్తిగత అజెండాలతోనే పవన్‌ కల్యాణ్‌ను జగన్‌ దూషిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకిచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేరిస్తే.. జనసేన పార్టీకి రోడ్డెక్కాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.

పవన్‌ కల్యాణ్‌ జోలికొస్తే మత్స్యకారులు తిరగబడతారు

ప్రభుత్వం ఇచ్చిన మత్స్యకార భరోసాలో నిజమైన మత్స్యకారులు ఎంత మంది ఉన్నారో ముఖ్యమంత్రి చెప్పగలరా అని జనసేన పార్టీ మత్స్యకార వికాస విభాగం ప్రధాన కార్యదర్శి డా. మూగి శ్రీనివాసరావు ప్రశ్నించారు. శనివారం విడుదల చేసిన ఓ వీడియో సందేశంలో ఆయన మాట్లాడుతూ ఇతర కులాల్లో ఉన్న వైసీపీ కార్యకర్తల్ని కూడా మత్స్యకారులుగా గుర్తిస్తారా అని నిలదీశారు. పవన్‌ కల్యాణ్‌ జోలికొస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మత్స్యకారులంతా తిరగబడి ప్రభుత్వాన్ని కూలదోస్తామని హెచ్చరించారు. మత్స్యకార భరోసా పేరుతో రూ. 10 వేలు ఇచ్చి తనేదో గొప్ప ముఖ్యమంత్రిగా ఫీలవుతున్నారని, ఆ నగదుతో మత్స్యకారుల జీవితాలు బాగుపడిపోతాయా అని ప్రశ్నించారు. మీరిచ్చిన మత్స్యకారుల్లో ఎంత మంది ఇతర కులాల వారున్నారో తెలుసా అని, వైసీపీ కార్యకర్తలైతే చాలన్నట్లు వారిని మత్స్యకారులుగా గుర్తిస్తారా అని నిలదీశారు. నవరత్నాల్లో ఏ రత్నం ఇంటికి వచ్చినా వారికి మత్స్యకార భరోసా ఇవ్వరని.. ఇదేనా ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అని ప్రశ్నించారు. వైఎస్సార్‌ హయాంలోపోర్టు నిర్మాణంతో ఎంతమంది మత్స్యకారుల జీవితాలు రోడ్డున పడ్డాయో గంగవరం వస్తే తెలుస్తుందన్నారు. వైసీపీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డిని అడిగితే చెబుతారన్నారు. 23 జిల్లాల్లో 90 లక్షల మంది ఉంటే అందులో ఎంత మందికి భరోసా ఇచ్చారని, ఎంత మందికి తెప్పలు, వలలు ఇచ్చారని డా. శ్రీనివాస్‌ అడిగారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement