Friday, April 19, 2024

రాజకీయాల్లో కలుపు మొక్కలు తీసేస్తా: పవన్ కళ్యాణ్

వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ఆరోపణలు చేశారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో వైసీపీ గ్రామసింహాలు అంటూ తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. వైసీపీ నేతల తరహాలో తాను మాట్లాడలేనని, ఆడబిడ్డలకు తాను ఎంతో గౌరవం ఇస్తానని తెలిపారు. అనాల్సిన మాటలు అని కులాల చాటున దాక్కుంటే బయటకు తీసుకొచ్చి కొడతామని మంత్రి పేర్ని నానిని ఉద్దేశించి మాట్లాడారు. తాను ఒకటి మాట్లాడితే.. వైసీపీ వాళ్లు మరొకటి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

తనకు సినిమాల్లోకి రావడం ఇష్టం లేదని.. కానీ తన బాధ్యతలను మరిచిపోకుండా ఉండేందుకు ఇంట్లో వాళ్లు సినిమాల్లోకి తీసుకొచ్చారని పవన్ వివరించారు. సినిమాల్లోకి రావడం ఇష్టం లేకపోయినా రాజకీయాల్లోకి చాలా ఇష్టంగా వచ్చానని తెలిపారు. తన ఇంట్లో కలుపుమొక్కలు తీయడం ఎంత ఇష్టమో.. రాజకీయాల్లో కలుపు మొక్కలు కూడా తీయడానికే వచ్చానని పేర్కొన్నారు. గుంటూరు జిల్లా బాపట్లలో పుట్టిన తనకు కూడా బూతులు మాట్లాడటం వచ్చన్నారు. కానీ తాను చాలా బాధ్యతగా మాట్లాడుతున్నానని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement