Friday, April 26, 2024

పండించే పంటకు పార్టీ రంగులు పులుముతారా?: పవన్

ఏపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఏపీలో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను, వాటికి సంబంధించిన లెక్కలను ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారని పవన్ ప్రశ్నించారు. ప్రభుత్వ వెబ్‌సైట్ నుంచి ఈ వివరాలను ఎందుకు తొలగించారో రైతులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులకు ధాన్యం సొమ్ములు చెల్లించడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందని పవన్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు డబ్బులు ఎందుకు చెల్లించలేదని ఏపీ ప్రభుత్వాన్ని పవన్ నిలదీశారు. జూలై నెలాఖరులోగా ప్రతి గింజకు డబ్బు చెల్లించాలని.. లేకపోతే రైతుల కోసం పోరాడతామని హెచ్చరించారు. ప్రభుత్వం రైతులకు రూ.3వేల కోట్ల బకాయి పడిందన్నారు. రబీ సీజన్‌లో కొనుగోలు చేసిన ధాన్యానికి ఉభయ గోదావరి జిల్లాలలోనే రూ.1800 కోట్ల వరకు చెల్లించాల్సి ఉందన్నారు. గతంలో తాను రైతుల కోసం సౌభాగ్య దీక్ష చేపడితేనే ప్రభుత్వం దిగి వచ్చి రైతులకు సొమ్ములు జమ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. జొన్న, మొక్కజొన్న కొనుగోలు విషయంలో రైతులను పార్టీలవారీగా విడదీయడం దురదృష్టకరమన్నారు. అధికార పార్టీకి మద్దతుగా ఉన్నవారి నుంచే పంటను కొనుగోలు చేస్తున్నారని పవన్ మండిపడ్డారు. పండించే పంటకు, తినే తిండికి పార్టీ రంగులు పులమడం దిగజారుడుతనానికి నిదర్శనమని పవన్ విమర్శించారు.

ఈ వార్త కూడా చదవండి: స్నాక్స్ అమ్ముతూ కోట్లు విక్రయిస్తున్న చిరు వ్యాపారులు

Advertisement

తాజా వార్తలు

Advertisement