Wednesday, April 24, 2024

ట్రాఫిక్ జామ్ తెచ్చిన కష్టం.. భార్యను భుజంపైనే ఆస్పత్రికి మోసుకువెళ్లిన భర్త

నారాయణపేట జిల్లా మరికల్‌కు చెందిన 19 ఏళ్ల యువతికి నెలరోజుల క్రితం వివాహం జరిగింది. రెండు రోజులుగా ఆమెకు జ్వరం వస్తూ తగ్గుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం ఆమెకు సరిగ్గా ఆక్సిజన్ అందలేదు. దీంతో కరోనా వచ్చిందేమోనని భావించిన కుటుంబ సభ్యులు తక్షణమే స్పందించి ఆమెను కారులో మహబూబ్‌నగర్ ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లేందుకు బయలుదేరారు. అయితే దేవరకద్రలో కోదాడ-రాయచూరు అంతర్‌రాష్ట్ర జాతీయ రహదారిపై రైల్వేవంతెన పనులు జరుగుతుండటంతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ నెలకొంది.

దీంతో యువతిని తీసుకువెళ్తున్న కారు ట్రాఫిక్‌జామ్‌లో ఇరుక్కుపోయింది. ఒకపక్క కారులో యువతి అనారోగ్యంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఊపిరి తీసుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతుండటంతో బంధువులకు ఏం చేయాలో పాలుపోలేదు. భర్త, కారు డ్రైవర్ ఆమెకు వీలైనంత త్వరగా వైద్యం అందాలని పరితపించారు. వారు ఆమెను భుజంపై ఎక్కించుకుని కిలోమీటరు దూరం మోసుకెళ్లారు. మధ్యలో ఆమెను వారిద్దరూ భుజం మార్చకుంటూ మోసుకెళ్లి సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. ప్రథమ చికిత్స అనంతరం 108 వాహనంలో మహబూబ్‌నగర్‌ జనరల్‌ ఆసుపత్రికి తరలించారు. కరోనా నిర్ధారణ పరీక్ష చేయించగా నెగిటివ్‌ రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం యువతి కోలుకుంటోందని కుటుంబసభ్యులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement