Friday, December 6, 2024

TG | పంచాయితీ భ‌వ‌నం తాక‌ట్టా… హరీశ్ రావు

  • ఇదేనా మీ ప‌రిపాల‌న ఘ‌న‌త
  • బిల్లులు రాక‌పోవ‌డంతో తొంబరావుపేట భ‌వ‌నం తాక‌ట్టు
  • విధిలేని స్థితిలో స‌ర్పంచ్ నిర్ణ‌యం
  • స్థానిక సంస్థ‌ల‌కు నిధులిస్తామంటూ హామీ
  • ఇప్పుడేమో జీతాల‌కూ డ‌బ్బులు లేని దుస్థితి
  • మభ్యం పెట్ట‌డం అపి నిధులివ్వండి
  • ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టికి హ‌రీశ్ రావు ట్విట్ ..

హైద‌రాబాద్ : జగిత్యాల జిల్లా తొంబరావుపేట గ్రామంలో చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు రాక పంచాయతీ భవనాన్ని తాకట్టు పెట్టాల్సిన దుస్థితి వచ్చిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ అభయ హస్తం మేనిఫెస్టోలో స్థానిక సంస్థలకు నిధులు, విధులు, నిర్వహణ పూర్తి స్థాయిలో అప్పగిస్తామ‌ని కాంగ్రెస్ నేత‌లు బీరాలు పలికార‌ని హ‌రీశ్‌రావు గుర్తు చేశారు.

ఇప్పుడు మాజీ సర్పంచులు పంచాయితీ భవనాలను తాకట్టు పెట్టే స్థితికి దిగజార్చారు. సర్పంచులు, ఎంపీటీసీలకు, జ‌డ్పీటీసీలకు గౌరవ వేతనం పెంచుతామ‌ని మభ్యపెట్టారు. ఇప్పుడు ఉన్న జీతాల బకాయిలకే దిక్కులేకుండా చేసారు. గ్రామపంచాయితీ సిబ్బందికి కనీస వేతనం, మాజీ సర్పంచులు, ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ సభ్యులకు గౌరవ పెన్షన్ గురించి కాంగ్రెస్ ఎన్నో ఆశలు కల్పించిన మాటలు రేవంత్ సర్కార్‌కు గుర్తు ఉందా..? మీరు చూపించిన అరచేతిలో స్వర్గం అటుంచి బకాయిలు ముందు విడుదల చేయండి భ‌ట్టి విక్ర‌మార్క గారు అని హ‌రీశ్‌రావు అడిగారు.

అమాత్యులు మార్పు అంటే ఇదేనా ..

- Advertisement -

పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్ గారి సొంత జిల్లాలోనే వడ్ల కొనుగోళ్ళు జరగవు. బిల్లులు విడుదల చేయడం లేదని గ్రామ పంచాయతీ కార్యాలయం తాకట్టు పెట్టే పరిస్థితి వచ్చినా ఆర్థిక మంత్రి , ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి గారు ప‌ట్టించుకోరు అంటూ హ‌రీష్ ట్విట్ట‌ర్ వేదిక‌గా నిల‌దీశారు.

మంత్రి సీత‌క్క గారి జిల్లాలోనే మద్దతు ధరకు పత్తి అమ్ముకోలేక రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నా కనికరించరు. ఫుడ్ పాయిజనింగ్ జరిగి గురుకులాల్లో విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నా విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్న ముఖ్యమంత్రి
మొద్దు నిద్ర వీడరు అంటూ మండిప‌డ్డారు.

రాష్ట్రంలో ఇన్ని సమస్యలు అంటే.. ఇవేవీ పట్టనట్లు, రాష్ట్ర ప్రజలకు సమస్యలే లేనట్లు..ముఖ్యమంత్రి సహా మంత్రులు పక్క రాష్ట్రాల ఎన్నికల ప్రచారానికి పయనమయ్యారు. పాలన గాలికి వదిలి, ఝార్ఖండ్‌ ఎన్నికల ప్రచారానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కేరళకు మంత్రి సీతక్క, మహారాష్ట్రకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. క్యూ కట్టిన పరిస్థితి . గారడి మాటలు చెప్పేందుకు గాలి మోటార్లు వేసుకుని బయల్దేరిన ముఖ్యమంత్రి, మంత్రుల్లారా.. మీరు చెప్పిన మార్పు అంటే ఇదేనా? అంటూ హారీశ్ నిల‌దీశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement