Friday, March 29, 2024

పాకిస్థాన్ మాజీ క్రికెటర్ ఇంజమామ్‌కు గుండెపోటు

పాకిస్థాన్ క్రికెట్ మాజీ కెప్టెన్, ప్రపంచ ఆల్ టైమ్ గ్రేట్ బ్యాట్స్ మెన్‌లో ఒకరిగా గుర్తింపు పొందిన ఇంజమామ్ ఉల్ హక్ గుండెపోటుకు గురయ్యాడు. గత మూడు రోజులుగా ఆయన ఛాతీ నొప్పితో బాధపడుతున్నాడు. సోమవారం తీవ్రమైన నొప్పి రావడంతో ఆయనను హుటాహుటిన లాహోర్ లోని ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల్లో ఆయనకు గుండెపోటు వచ్చినట్టు వైద్యులు నిర్ధారించారు. అనంతరం నిన్న సాయంత్రం ఆయనకు యాంజియోప్లాస్టీని వైద్యులు నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు.

ఇంజమామ్ ప్రస్తుత వయసు 51 సంవత్సరాలు. పాకిస్థాన్ తరపున వన్టేల్లో అత్యధిక పరుగులు సాధించిన ఘనత ఇంజమామ్ పేరిటే ఉంది. 375 వన్డేలు ఆడిన ఇంజమామ్ మొత్తం 11,701 పరుగులు చేశారు. 119 టెస్టులు ఆడిన ఆయన 8,829 రన్స్ చేశాడు. అత్యంత విజయవంతమైన పాకిస్థాన్ కెప్టెన్లలో ఒకరిగా కూడా ఆయన గుర్తింపు పొందాడు. 2007లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఆయన రిటైర్ అయ్యారు. రిటైర్మెంట్ తర్వాత పాకిస్థాన్ క్రికెట్ కు పలు స్థానాల్లో ఆయన సేవలు అందించాడు. బ్యాటింగ్ కన్సల్టెంట్ గా పని చేశారు. 2016-19 మధ్య కాలంలో పాక్ జట్టుకు చీఫ్ సెలెక్టర్ గా ఉన్నాడు. అంతేకాదు ఆఫ్ఘనిస్థాన్ జట్టుకు హెడ్ కోచ్‌గా కూడా సేవలందించాడు. ఇంజమామ్ త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement