Saturday, March 23, 2024

Delhi | బీజేపీలో చేరిన పైడి రాకేశ్ రెడ్డి.. తరుణ్ చుగ్ సమక్షంలో పార్టీ తీర్థం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ప్రముఖ పారిశ్రామిక వేత్త పైడి రాకేశ్ రెడ్డి గురువారం భారతీయ జనతా పార్టీలో చేరారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి తరుణ్ చుగ్ చేతుల మీదుగా ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సమక్షంలో రాకేశ్ రెడ్డికి తరుణ్ చుగ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం చుగ్ మాట్లాడుతూ.. తెలంగాణలో తొమ్మిదేళ్లుగా కుటుంబ పాలన, వంచన పాలన, అవినీతి పాలనే సాగిందని అన్నారు. కేసీఆర్ పాలనపై ప్రజలు విసుగెత్తిపోయారని, వారంతా ప్రత్యామ్నాయంగా బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ కోసమే పనిచేస్తోందని తరుణ్ చుగ్ ఆరోపించారు.

కాంగ్రెస్ గుర్తుమీద గెలిచినవాళ్లు కేసీఆర్ పంచన చేరి మంత్రివర్గంలో కూడా కూర్చుంటున్నారని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో కేసీఆర్, కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్నారని అన్నారు. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవాలని కేసీఆర్ వెంపర్లాడుతున్నారని, ఇప్పటికే లోపాయికారి ఒప్పందంతో రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని విమర్శించారు. స్వచ్ఛమైన తెలంగాణ బిడ్డ, పారిశ్రామికవేత్త పైడి రాకేశ్ రెడ్డి బీజేపీలో చేరడం సంతోషంగా ఉందని, ఆయనకు స్వాగతం పలుకుతున్నానని చెప్పారు. నవంబర్‌లో జరిగే ఎన్నికల్లో బీజేపీ పూర్తి మెజారిటీతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -

నిజామాబాద్ నుంచే పోటీ చేయాలి.. కవితకు ఎంపీ ధర్మపురి అరవింద్ సవాల్

ఆర్మూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్న పైడి రాకేశ్ రెడ్డిని తన వెంట తీసుకొచ్చి బీజేపీలో చేర్చిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నిజామాబాద్ నుంచే పోటీ చేయాలని సవాల్ విసిరారు. మాజీ ఎంపీగా, ఎమ్మెల్సీగా నిజామాబాద్‌లోనే పర్యటించాల్సిన కవిత పారిపోయి మెదక్‌లో ఎక్కువగా పర్యటిస్తున్నారని అరవింద్ అన్నారు. కేసీఆర్ కూడా తన కుమార్తెను నిజామాబాద్ బదులు మెదక్ నుంచి కవితను బరిలోకి దించాలని చూస్తున్నారని చెప్పారు. తాను తండ్రిమాట విననట్టే కవిత కూడా తండ్రి మాట వినకుండా నిజామాబాద్ నుంచే పోటీ చేయాలని సూచించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఒక విఫలమైన మందు అని వ్యాఖ్యానించారు. ప్యాకేజి కోసమే కాంగ్రెస్ నేతలు పనిచేస్తున్నారని సూత్రీకరించారు. రాష్ట్రానికి కల్వకుంట్ల కుటుంబం ఒక రోగం అని, దానికి విరుగుడు బీజేపీయేనని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని ఎన్నికల్లో కోట్లాడినా, ఎన్నికలు ముగియగానే దోస్తీ కడుతారని ధర్మపురి అరవింద్ అన్నారు. కాంగ్రెస్‌లో గెలిచినోళ్లు బీఆర్ఎస్‌లో చేరడం కొత్తేమీ కాదని గుర్తుచేశారు. తెలంగాణ ఫలితం బీజేపీ‌కి అనుకూలంగా ఉంటుందని, తెలంగాణ ప్రజలు మార్పుకు ఓటు వేస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలు చాలామంది బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.

భారత్ అంటేనే బీజేపీ- రాకేశ్ రెడ్డి

కాషాయ కండువా కప్పుకున్న అనంతరం వ్యాపారవేత్త రాకేశ్ రెడ్డి మాట్లాడుతూ.. భారత్ అంటే బీజేపీ అని వ్యాఖ్యానించారు. విదేశాల్లో నివసిస్తున్న భారతీయులందరూ బీజేపీ పట్ల గర్వంగా భావిస్తున్నారని చెప్పారు. అమరవీరుల త్యాగాల తెలంగాణ ఇది కాదని, తెలంగాణాలో రౌడీల రాజ్యం నడుస్తోందని రాకేశ్ రెడ్డి ఆరోపించారు. మోడీ నాయకత్వం నచ్చి తాను బీజేపీలో చేరానని అన్నారు. కార్యకర్తగా ఉంటూనే పార్టీ ఎలాంటి బాధ్యత ఇచ్చినా మోసేందుకు సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. ఆర్మూరు పరిసర ప్రాంతాల్లో ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్న టిప్పర్లను అడ్డుకోవడమే తన ప్రథమ లక్ష్యమని ఆయన తెలిపారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement