Thursday, April 18, 2024

తెలంగాణ కీర్తిని దేశమంతా చాటిన నటుడు పైడి జైరాజ్ : మంత్రి శ్రీనివాస్ గౌడ్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ కీర్తిని జాతీయస్థాయిలో చాటి చెప్పిన గొప్ప నటుడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత పైడి జైరాజ్ 113వ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రొహిబిషన్, ఎక్సైజ్, క్రీడలు, పర్యాటకం, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఘన నివాళి అర్పించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన, తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బాలీవుడ్లో అగ్ర హీరోగా రాణిస్తూ, దర్శకుడిగా, నిర్మాతగా, బహుభాషా నటుడిగా గుర్తింపు పొంది జాతీయ చలనచిత్ర పరిశ్రమకు అందించిన సేవలకు గుర్తుగా ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్న తొలి తరం తెలంగాణ ముద్దుబిడ్డ పైడి జైరాజ్ అని అన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మార్గదర్శకత్వంలో రాష్ట్రానికి చెందిన వైతాళికులను, కవులను, కళాకారులను, సాహితివేత్తల ను, సామాజికవేత్తలను గుర్తించి గౌరవిస్తున్నారన్నారు. పైడి జయరాజు సేవలకు గుర్తుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి కళావేదిక రవీంద్రభారతిలో ప్రివ్యూ థియేటర్‌కు ‘పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్’గా పేరు పెట్టి గౌరవిస్తున్నామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ యాస, భాషా, సంస్కృతులను, కళాకారులను నిర్లక్ష్యం చేశారన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో తెలంగాణ యాస, భాషా, సంస్కృతి సాంప్రదాయాలకు, కళాకారులకు తగిన గుర్తింపు, గౌరవం లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, టీజీవో ప్రధాన కార్యదర్శి ఎ. సత్యనారాయణ, టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్, టీజీవో కోశాధికారి పుల్లెంల రవీందర్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement