Saturday, April 20, 2024

మలేసియాకు మన తేజస్‌! యుద్ధ విమానాల సరఫరాకు త్వరలో ఒప్పందం

న్యూఢిల్లి:మలేసియాకు తేలికపాటి యుద్ధ విమానాలైన తేజస్‌ జెట్‌ల సరఫరాకు సంబంధించిన కాంట్రాక్టు సాధించడంలో భారత్‌ జెడ్‌ స్పీడ్‌తో వ్యవహరించింది. సుమారు 18 తేజస్‌లను సరఫరా చేసే డీల్‌ తుది దశకు చేరుకుంది. యుద్ధంలో మునిగితేలుతున్న రష్యాను, కరోనాతో సతమతమవుతున్న చైనా ఆదమరచి ఉన్న వేళ భారీ డీల్‌పై మలేసియాతో ఒప్పందం కుదుర్చుకునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంది.. రష్యా రూపొందించిన సుఖోయ్‌ 30 యుద్ధ విమానాల నిర్వహణ, విడిభాగాల సరఫరా విషయంలోనూ సహకరించేందుకు భారత్‌ సంసిద్ధత వ్యక్తం చేసింది. అయితే తుది దశలో ఉన్న ఈ ఒప్పందాలకు త్వరలో ఆమోదముద్ర పడనుంది. తేలికపాటి యుద్ధ విమానాలను సరఫరా చేయడంతోపాటు వాటి నిర్వహణ, హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌)కు చెందిన నిపుణులను నిరంతరం అందుబాటులో ఉంచేందుకు మంచి ప్యాకేజీని భారత్‌ ఆఫర్‌ చేసింది. పైగా మలేసియాలోనే ఈ కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధపడింది. మలేసియాకు తేలికపాటి యుద్ధ విమానాలను సరఫరా చేసేందుకు దక్షిణ కొరియా, చైనా ఆసక్తి చూపాయి.

కానీ సుఖోయ్‌ యుద్ధ విమానాలను రష్యా తయారు చేస్తుండగా వీటికి సంబంధించి ఆ దేశంతో ద.కొరియా, చైనాలకు ఎటువంటి ఒప్పందాలు లేవు. అందువల్ల నిర్వహణ విషయంలో వాటికి ఏమాత్రం అవగాహన ఉండదు. మరోవైపు రష్యానుంచి భారత్‌ సుఖోయ్‌ 30 యుద్ధ విమానాలను పెద్దఎత్తున కొనుగోలు చేసింది. అందువల్ల వాటి నిర్వహణ, తయారీ విషయంలో భారత్‌కు అపార అనుభవం ఉంది. కాగా మలేసియా వద్ద ప్రస్తుతం 18 సుఖోయ్‌ 30 ఎంకేఎం యుద్ధ విమానాలున్నాయి. పైగా ఎమ్‌కే1 తరహా భారత్‌ యుద్ధ విమానాలతో అవి దాదాపు పోలి ఉంటాయి. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర నేపథ్యంలో ప్రపంచ దేశాలు ఆంక్షలు విధించాయి. ఈ నేపథ్యంలో సుఖోయ్‌ 30 యుద్ధ విమానాల తయారీ, విడి భాగాల ఉత్పత్తి, సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. ఈ పరిస్థితుల్లో భారత్‌వైపు మలేషియా మొగ్గు చూపింది. అయితే ఒప్పందంపై ఇరుదేశాల ప్రతినిధి బృందాల స్థాయిలో చర్చలు పూర్తయ్యాయి. ఇక ప్రభుత్వాల పరిథిలో తుది నిర్ణయం తీసుకోవలసి ఉంది. భారత్‌ సరఫరా చేసే తేజస్‌ యుద్ధ విమానాలకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఎల్‌సీఏ ఎంకే 1ఏ తరహా తేజస్‌ యుద్ధ విమానాల్లో అధునాతన ఏఈఎస్‌ఏ రాడార్‌ ఉంటుంది. గాలిలోంచి గాలిలోకి, గాలిలోంచి భూమి మీద ఆయుధాలను ప్రయోగించడానికి ఈ విమానాల్లో సౌలభ్యం ఉంది. ఒక్కో తేజస్‌ ఎల్‌సీఏ ధర దాదాపు 42 మిలియన్‌ డాలర్లుగా ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement