Thursday, April 25, 2024

అమ్మ కడుపులో కరోనా.. శిశువు పేగుల్లో గ్యాంగ్రీన్

కరోనా సోకిన వారికి పేగుల్లో రక్తం గడ్డలు కట్టడం కొత్తగా బయటపడిన లక్షణం. ఇప్పటివరకు దీన్ని పెద్దల్లోనే గమనించాం. కానీ.. అమ్మ కడుపులో ఉండగానే కరోనా బారిన పడిన శిశువు పుట్టిన తర్వాత వైద్యులు ఈ సమస్యను గుర్తించారు. పేగుల్లో ఇన్ఫెక్షన్‌ (గ్యాంగ్రిన్‌) ఏర్పడడంతో శస్త్రచికిత్స చేసి ఆ బిడ్డ ప్రాణాలు కాపాడారు. గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన వేమవరపు గోపీ, కరుణ దంపతులకు మే 30న స్థానిక వసంత మెటర్నరీ సెంటర్‌లో ఆడ శిశువు జన్మించింది. తొమ్మిదో నెలలో కరుణకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో చికిత్స తీసుకుని కోలుకుంది. డెలివరీకి ముందు మరోసారి పరీక్ష చేయగా.. నెగిటివ్‌ వచ్చింది. అయితే ప్రసవం అనంతరం శిశువు కడుపు ఉబ్బరంగా ఉండి పసరు వాంతులు అవుతున్నాయి. మలవిసర్జన జరగడం లేదు. పాలు కూడా తాగడం లేదు.

దీంతో వైద్యులు గుంటూరులోని డాక్టర్‌ యర్రాస్‌ హాస్పిటల్‌కు వెళ్లాలని సిఫారసు చేశారు. పీడియాట్రిక్‌ సర్జన్‌ డాక్టర్‌ యర్రా రాజేష్‌ శిశువుకు పరీక్షలు జరిపి పేగుల్లో ఇన్ఫెక్షన్‌ ఉందని గుర్తించారు. అనంతరం ఆరోగ్యశ్రీ పథకం కింద మే 31న శస్త్రచికిత్స నిర్వహించారు. రక్తం గడ్డలు కట్టడంతో 2.5 అంగుళాల మేర పాడైపోయిన పేగును గుర్తించి దాన్ని తొలగించారు. ఈ ఆపరేషన్‌లో వైద్యులు శ్రీకాంత్‌రెడ్డి, జగన్‌ మోహన్‌ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్‌ రాజేష్‌ మాట్లాడుతూ.. తల్లి గర్భవతిగా ఉన్నపుడు కరోనా బారినపడడంతో గర్భస్థ శివువుకు కూడా ఆ ఇన్ఫెక్షన్‌ సోకిందని తెలిపారు. ఇటీవల ముంబైలో 9 మంది పెద్దవారిలో పేగుల్లో గ్యాంగ్రిన్‌ గుర్తించారని, కానీ.. తల్లి గర్భంలోనే కరోనా వల్ల శిశువు పేగులు గ్యాంగ్రిన్‌కు గురైనట్లు గుర్తించడం ఇదే తొలిసారి అని వైద్యులు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement