Thursday, March 28, 2024

కేంద్రంపై ప్రతిపక్షాల కన్నెర్ర.. 18 ప్రతిపక్ష పార్టీల నిరసన ర్యాలీ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వ తీరుపై ప్రతిపక్షాలు కన్నెర్ర చేశాయి. అదానీ అంశంపై మూడో రోజూ పార్లమెంట్‌ ఉభయ సభల్లో ఆందోళన చేపట్టాయి. అదానీ వ్యవహారంపై తక్షణమే జేపీసీని ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్‌తో పాటు విపక్ష ఎంపీలు పట్టు పట్టడంతో పార్లమెంట్ కార్యకలాపాలు స్తంభించడంతో కాసేపు లోక్‌సభ, రాజ్యసభను వాయిదా వేశారు. దీంతో ఈడీ, సీబీఐ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలతో ప్రతిపక్ష నేతలపై కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా దాడులు చేయిస్తోందని, అదానీ వంటి వ్యాపారవేత్తలకు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ బీఆర్ఎస్‌తో సహా 18 ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు పాత, కొత్త పార్లమెంట్ మధ్యలోకి వచ్చి పెద్దఎత్తున ధర్నా చేశారు.

అనంతరం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి పార్లమెంట్ నుంచి కాలినడకన బయల్దేరారు. విపక్షాల ర్యాలీని దృష్టిలో ఉంచుకుని ఈడీ ఆఫీస్ దగ్గర భారీగా పోలీసులను మోహరించారు. మూడంచెలుగా బారికేడ్లు ఏర్పాటు చేసి, భారీ స్థాయిలో బలగాలను మోహరించి విజయ్‌చౌక్‌లోనే పోలీసులు వారిని అడ్డుకున్నారు. వెనక్కి వెళ్లిపోవాల్సిందిగా మైక్‌లో హెచ్చరించారు. దీంతో ప్రతిపక్ష నేతలు ప్లకార్డులు పట్టుకుని అక్కడే నినాదాలు చేశారు. దీంతో కాసేపు పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.

అనంతరం బీఆర్‌ఎస్ లోక్‌సభా పక్ష నేత నామా నాగేశ్వరరావు, కాంగ్రెస్ నేత ఖర్గే నేతృత్వంలో కొందరు ఎంపీలు ఈడీ డైరెక్టర్ ఎస్కే మిశ్రాను కలిసి వినతిపత్రం అందజేశారు. అదానీ వ్యవహారంపై దర్యాప్తు జరిపించాలని, దీనిపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేయాలని కోరారు. కేంద్రం ప్రతిపక్షాల గొంతు నొక్కివేస్తోందని ఆరోపించారు. విపక్షాల పైకి ఉద్దేశపూర్వకంగా దర్యాప్తు సంస్థల్ని పంపడం సరికాదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement