Friday, June 25, 2021

ఆన్‌లైన్ మ‌ద్యం అమ్మకాలు షురూ..!

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో మ‌రోసారి ఆన్‌లైన్ ద్వారా మ‌ద్యం అమ్మ‌కాలు ప్రారంభ‌మ‌య్యాయి. ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (సీఎస్‌ఎంసీఎల్) వెబ్‌సైట్‌, యాప్ ద్వారా ఆదివారం నుంచి మ‌ద్యం ఆన్‌లైన్‌ బుక్కింగ్స్‌ను ఎక్సైజ్ శాఖ ప్రారంభించింది. ఒక వ్య‌క్తి ఐదు లీట‌ర్ల మ‌ద్యం మాత్ర‌మే కొనుగోలు చేయాలి. మ‌ద్యం ధ‌ర‌తోపాటు ఇంటి వ‌ద్ద‌కు పంపిణీకి అద‌నంగా రూ.100 బుకింగ్ సంద‌ర్భంగా ముందుగా చెల్లించాలి. సోమ‌వారం నుంచి హోమ్ డెలివ‌రీ ప్రారంభ‌మ‌వుతుంది. ఉద‌యం 9 గంట‌ల నుంచి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు మ‌ద్యాన్ని హోమ్ డెలివ‌రీ చేస్తారు. స్థానిక క‌రోనా ప‌రిస్థితుల‌ను అనుస‌రించి డెలివ‌రీ స‌మ‌యాలు మారుతుంటాయి. ఒక ప్రాంతంలోని 15 కిలోమీట‌ర్ల ప‌రిధిలోని వైన్ షాపుల నుంచి మ‌ద్యాన్ని ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయాలి. అయితే ఏ షాపు హోమ్ డెలివ‌రీ చేస్తుంది అన్న‌ది సీఎసీఎంసీఎల్ నిర్ణ‌యిస్తుంది.

క‌రోనా సెకండ్ వేవ్ వ‌ల్ల లాక్‌డౌన్ కొన‌సాగుతున్న నేప‌థ్యంలో ఆ రాష్ట్రంలో మ‌ద్యం షాపుల‌ను మూసివేశారు. దీంతో మ‌ద్యం ల‌భించ‌క ఇటీవ‌ల కొంద‌రు ఆల్క‌హాల్ క‌లిగిన‌ హోమియో మందు సేవించి చ‌నిపోయారు. మ‌రోవైపు ఇత‌ర రాష్ట్రాల నుంచి అక్ర‌మ మ‌ద్యం కొనుగోలు పెరిగాయి. ఈ నేప‌థ్యంలో వీటిని నియంత్రించేందుకు గ‌త ఏడాది లాక్‌డౌన్ స‌మ‌యంలో అమ‌లు చేసిన మాదిరిగా ఆన్‌లైన్‌లో మ‌ద్యం అమ్మ‌కాలకు అనుమ‌తించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.

Advertisement

తాజా వార్తలు

Prabha News