Tuesday, March 26, 2024

అమెజాన్‌కు లక్ష జరిమానా.. నాణ్యతలేని కుక్కర్లను వెనక్కి తీసుకోవాలని సీసీపీఏ ఆదేశం..

ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన కస్టమర్‌కు నాణ్యతలేని కుక్కర్‌ను పంపించిన ఈ కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌కు భారీ జరిమానా పడింది. కేంద్ర వినియోగదారుల సంరక్షణ ఆథారిటీ (సీసీపీఏ) అమేజాన్‌పై లక్ష రూపాయల జరిమానా విధించింది. నాణ్యతలేని వస్తువును వెంటనే వెనక్కి తీసుకుని, ఆయా కస్టమర్లకు డబ్బులు వాపస్‌ చేయాలని ఆదేశించింది. అమెజాన్‌ ద్వారా 2,265 మంది కస్టమర్లు ప్రెషర్‌ కుక్కర్లను కొనుగోలు చేశారని, వారందరి నుంచి వాటిని వెనక్కి తీసుకోవాలని, వారికి డబ్బులు తిరిగి చెల్లించాలని సీసీపీఏ ఆదేశించింది. అమెజాన్‌ తన ప్లాట్‌ఫాం నుంచి నాణ్యతలేని కుక్కర్లను అమ్మడంతో ఈ ఆదేశాలు జారీ చేశామని సంస్థ చీఫ్‌ కమిషనర్‌ నిధి ఖేర్‌ తెలిపారు. నాణ్యత ప్రమాణాలు సరిగాలేని ప్రెషర్‌ కుక్కర్లను అమ్మే సంస్థలపై చర్యలు తీసుకుంటామని నిధి ఖేర్‌ స్పష్టం చేశారు. ఈ కేసును సంస్థ సుమోటోగా స్వీకరించి, విచారణ జరిపింది. నాణ్యతలేని వస్తువులను విక్రయిస్తున్నట్లు గురించిన ఈ కామర్స్‌ సంస్థలకు నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు. ఇలా నోటీసులు ఇచ్చిన సంస్థల్లో అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, పేటీఎం మాల్‌, షాపింగ్‌ క్లూస్‌, స్నాప్‌డీల్‌ వంటి సంస్థలు ఉన్నాయి. వీటి ద్వారా వస్తువులు అమ్మేవారికి కూడా నోటీసులు జారీ చేశారు.

సీసీపీఏ క్వాలిటీ కంట్రోల్‌ ఆర్డర్‌ ఇచ్చిన తరువాత నిర్ధేశించిన ప్రమాణాలు లేని 2,265 ప్రెషర్‌ కుక్కర్లను అమెజాన్‌ ద్వారా విక్రయించినట్లు గుర్తించినట్లు తలిపింది. వీటి విలువ 6,14,825.41 రూపాయాలు అని తెలిపింది. అమెజాన్‌ నుంచి అమ్మె ప్రతిదానిపై కమిషన్‌ వస్తుందని అంగీకరించినందున , నాణ్యత విషయంలో బాధ్యత నుంచి తప్పించుకోవడం కుదరదని సీసీపీఏ స్పష్టం చేసింది. 45 రోజుల్లోగా అమ్మిన అన్ని నాణ్యతలేని ప్రెషర్‌ కుక్కర్లను వెనక్కి పిలింపించి, అందరికీ డబ్బులు వాపస్‌ చేయాలని, దీనిపై సీసీపీఏకి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అమెజాన్‌తో పాటు ఇలా నాణ్యతలేని ప్రెషర్‌ కుక్కర్లును పేటీఎం మాల్‌ నుంచి విక్రయించినట్లు గుర్తించారు. సీసీపీఏ ఆదేశాలతో ఈ సంస్థ కూడా లక్ష రూపాయలను డిపాజిట్‌ చేసింది. వినియోగదారుల హక్కుల రక్షణకు సీసీపీఏ నిరంతరం కృషి చేస్తుందని కమిషనర్‌ తెలిపారు. ఇటీవలనే కొన్ని ఈ కామర్స్‌ వెబ్‌సైట్లలో ఆయుర్వేద, సిద్ధ, యునానీ పేరుతో అమ్ముతున్న మందులపై కూడా నోటీసులు జారీ చేసింది. తప్పుదోవపట్టించే వాణిజ్య ప్రకటనలపై కూడా సీసీపీఏ కొరడా ఝుళిపించింది. ఇలాంటి ఉత్పత్తులను ప్రమోట్‌ చేసే వారిపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ కామర్స్‌ వెబ్‌సైట్ల నుంచి, రిటైల్‌గా అమ్మే వ్యాపారులు కూడా ఐఎస్‌ఐ, బీఐఎస్‌ గుర్తింపు ఉన్న ఉత్పత్తులనే అమ్మకాలని ఆదేశించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement