Sunday, December 3, 2023

Delhi | ఏదో ఒక రోజు ఆప్ దేశాన్ని ఏలుతుంది.. అతివేగంగా విస్తరిస్తున్న పార్టీ మాది : అరవింద్ కేజ్రీవాల్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఏదో ఒక రోజు దేశాన్ని ఏలుతుందని ఆ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీలో ఆ పార్టీ నిర్వహించిన కార్మికుల సదస్సులో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఆప్’ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పార్టీ అన్న కేజ్రీవాల్, ఈ సదస్సుకు వచ్చిన వారంతా ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పార్టీలో భాగమేనన్నారు. ఇప్పటి వరకు ప్రపంచంలో ఇంత వేగంగా అభివృద్ధి చెందిన పార్టీ ఏదీ లేదని, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో పార్టీ పేరును చేర్చాలని ఢిల్లీ సీఎం అన్నారు.

- Advertisement -
   

తమ పార్టీ దేశంలోనే మూడో అతిపెద్ద పార్టీగా అవతరించిందని గుర్తుచేశారు. ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటుచేయడంతో పాటు గుజరాత్‌లో 14 శాతం ఓట్లతో ఐదుగురు ఎమ్మెల్యేలను, గోవాలో ఇద్దరు ఎమ్మెల్యేలను గెలిపించుకుని జాతీయ పార్టీ హోదా సాధించిందని తెలిపారు. దేశవ్యాప్తంగా 1350 పార్టీలున్నా.. వాటిలో ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రమే వాటన్నింటినీ అధిగమించి శరవేగంగా ఎదిగి మూడో స్థానానికి చేరుకుందని తెలిపారు. ఇదే వేగంతో ముందుకెళ్తే ఏదో ఒక రోజు కాంగ్రెస్, బీజేపీలను కూడా అధిగమించి దేశాన్ని పరిపాలిస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. బీజేపీలో అవినీతికి ఎవరూ వ్యతిరేకం కాదని అన్నారు. జూన్ 27న ఎన్సీపీ నేతలను అవినీతిపరులని విమర్శించారని, రూ.70 వేల కోట్ల అవినీతిపరుడిగా అభివర్ణించిన నేతను.. బీజేపీలో చేరిన వెంటనే ఉప ముఖ్యమంత్రిని చేశారని మహారాష్ట్ర ఉదంతాన్ని ఉదహరిస్తూ తెలిపారు. అస్సాంలో వేధింపులకు గురైన వ్యక్తిని జైలుకు పంపిస్తామన్నారని, తీరా బీజేపీలో చేరిన వెంటనే ముఖ్యమంత్రి అయ్యారని ఎద్దేవా చేశారు. శారదా చిట్‌ఫండ్‌ కుంభకోణంలో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న సువేందు అధికారి బీజేపీలో చేరి తన పాపాలను కడిగేసుకున్నారని, ఇదేనా ప్రధాని మోదీ నిజాయితీ అని కేజ్రీవాల్ ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement