Tuesday, April 23, 2024

ఒమిక్రాన్‌.. ముంబై, గుజరాత్‌లో కేసులు నమోదు..

న్యూఢిల్లీ : భారత్‌లో ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసులు సంఖ్య నాలుగుకు చేరుకుంది. తాజాగా గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు చెందిన వ్యక్తికి ఒమిక్రాన్‌ నిర్ధారణ అయినట్టు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు శనివారం వెల్లడించారు. ఆ వ్యక్తి ఇటీవలే జింబాబ్వే నుంచి వచ్చినట్టు గుర్తించారు. దీంతో భారత్‌లో ఈ వేరియంట్‌ కేసులు మూడుకు చేరుకున్నాయి. అదేవిధంగా దేశ ఆర్థిక రాజధాని ముంబైకి చెందిన 33 ఏళ్ల వ్యక్తిలో ఈ వేరియంట్‌ను గుర్తించారు. అతడు గత నెల దక్షిణాఫ్రికా నుంచి దుబాయ్‌, ఢిల్లీ మీదుగా ముంబై చేరుకున్నాడు. కరోనా పరీక్షలు చేయగా.. ఒమిక్రాన్‌ వేరియంట్‌ పాజిటివ్‌ వచ్చింది. తాజా కేసుతో కలిపి దేశంలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య నాలుగుకు చేరుకుంది. దేశంలో తొలి కేసు కర్నాటక రాజధాని బెంగళూరులో నమోదైన విషయం తెలిసిందే. బెంగళూరులో ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసులు నమోదుతో దేశం మొత్తం ఉలిక్కిపడింది.

గుజరాత్‌లో ఆంక్షలు..
ఇద్దరికి ఒమిక్రాన్‌ సోకినట్టు కేంద్రం ధ్రువీకరించగా.. వీరిలో ఒకరు విదేశీయుడు కాగా.. మరొకరు కర్నాటకకు చెందిన డాక్టర్‌. ఒమిక్రాన్‌ సోకిన వైద్యుడికి ఎలాంటి ట్రావెల్‌ హిస్టరీ లేకపోవడం గమనార్హం. ఇక జింబాబ్వే నుంచి వచ్చిన 72 ఏళ్ల వృద్ధుడికి కరోనా వైరస్‌ నిర్ధారణ కావడంతో జెన్యూ పరీక్షల కోసం పంపామని అధికారులు తెలిపారు. జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ అతడికి ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఉన్నట్టు తేలిందన్నారు. గుజరాత్‌ ఆరోగ్య కమిషనర్‌ జై ప్రకాష్‌ శివహరే సైతం దీన్ని ధ్రువీకరించారు. ఆఫ్రికా నుంచి వచ్చాక ఆ వ్యక్తి 90 మందిని కలిసినట్టు అధికారులు నిర్ధారించారు. వారందరి సమాచారం తెలుసుకుని పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రెండు కేసులతో కర్నాటక ప్రభుత్వం అప్రమత్తం కాగా.. ఇప్పుడు గుజరాత్‌లోనూ ఆంక్షలను కఠినతరం చేశారు.

38 దేశాలకు వ్యాప్తి
దక్షిణాఫ్రికాలో తొలిసారి గుర్తించిన ఒమిక్రాన్‌ వేరియంట్‌ ప్రస్తుతం 38 దేశాలకు వ్యాపించింది. ఇది గత వేరియంట్ల కంటే భిన్నమైందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత్‌లో రెండో దశ వ్యాప్తికి కారణమైన డెల్టా వేరియంట్‌ కంటే ఒమిక్రాన్‌ ఆరురెట్లు వేగంగా వ్యాప్తిచెందుతున్నట్టు డబ్ల్యూహెచ్‌ఓ ప్రాథమికంగా అంచనా వేసింది. టీకాలు, కరోనా బారినపడ్డప్పుడు వచ్చిన రోగ నిరోధక శక్తిని తప్పించుకుంటుందనే అంచనాలు కూడా ఉన్నాయి. భారత్‌ ఆరోగ్య శాఖ మాత్రం ఒమిక్రాన్‌ తీవ్రత తక్కువే ఉంటుందని అంచనా వేస్తోంది. ఎందుకంటే దేశంలో జులై నాటికి 70 శాతం మందిలో వ్యాక్సినేషన్‌, సెకండ్‌ వేవ్‌ వల్ల యాంటీబాడీలు రావడమే కారణమని తెలిపింది. దేశంలో 94 కోట్ల మంది పెద్దవాళ్లలో సగం పూర్తి టీకా, 84 శాతం మంది కనీసం ఒక్క డోస్‌ తీసుకున్నారు. ఇదిలా ఉంటే.. విదేశాల నుంచి భారత్‌లో దిగిన కొందరి ఆచూకీ అధికారులకు చిక్కకపోవడం ఇప్పుడు సమస్యగా మారింది. వారి అడ్రస్‌లు తప్పుగా ఇచ్చినట్టు తెలుస్తోంది. వారు ఇచ్చిన అడ్రస్‌లో కాకుండా.. ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవడంతో వైరస్‌ వ్యాప్తి చెందే ముప్పు పొంచి ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement