Wednesday, April 24, 2024

వ్యాక్సినేషన్‌తో నార్మల్​ డేస్​.. పర్యాటక రంగానికి ఫుల్​ జోష్​: కిషన్‌రెడ్డి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : పర్యాటక రంగానికి పునర్వైభవం రాబోతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వాలు తగిన ఏర్పాట్లతో సిద్ధం కావాలని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్‌రెడ్డి సూచించారు. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రులు, కార్యదర్శులు, సంబంధిత అధికారులతో న్యూఢిల్లీలోని అశోక హోటల్‌లో “అమృత సమాగం” సదస్సును కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కిషన్‌రెడ్డి ప్రారంభించారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో రాష్ట్ర మంత్రులు, అధికారులు ప్రతి గ్రామం, మండలం, జిల్లా స్థాయిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో కార్యక్రమాలు నిర్వహించడంపై చర్చించి తగిన కార్యాచరణ, ప్రణాళికను రూపొందిస్తారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉన్నత లక్ష్యాలతో దేశ ప్రజలందరూ జరుపుకునే ఉత్సవమని అమిత్ షా తెలిపారు. భవిష్యత్ తరాలకు స్వాతంత్ర్య సమరయోధుల గురించి, వారి పోరాటాల గురించి తెలియజేయాల్సిన అవసరముందన్నారు.

దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా భారత దేశాన్ని ప్రపంచ వేదికపై అగ్రస్థానంలో నిలబెట్టాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంకల్పించారని అమిత్ షా చెప్పుకొచ్చారు. దేశ ప్రజలు పార్టీలకు అతీతంగా దేశాభివృద్ధికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ… ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో అమలు చేసేందుకు అమిత్ షా అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. దాదాపు 184 కోట్ల వ్యాక్సిన్ డోసులిచ్చామని, బూస్టర్ డోస్‌తో జనంలో నమ్మకం పెరిగిందని సంతోషం వ్యక్తం చేశారు. వాక్సినేషన్ కార్యక్రమం ద్వారా పర్యాటక రంగం పురోగమిస్తోందని అన్నారు. శ్రీనగర్‌లోని వసతి గృహాలు వచ్చే 3 నెలల కాలానికి పూర్తిగా రిజర్వ్ అవ్వడమే ఇందుకు ఉదాహరణ అని కిషన్‌రెడ్డి చెప్పారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాలను కొన్ని రాష్ట్రాలలో చాలా వైభవంగా నిర్వహించామని, ఎన్జీవోలు కూడా ముందుకొచ్చి ఉత్సవాల్లో పాలుపంచుకున్నాయని కిషన్‌రెడ్డి వివరించారు. రంగోలి, మేరా గావ్, మేరీ దారోహర్ వంటి వివిధ కార్యక్రమాల ద్వారా గ్రామస్థాయిలో కూడా డిజిటల్ మాధ్యమాన్ని విస్తృతం చేశామని హర్షం వ్యక్తం చేశారు.

కరోనా కష్టకాలంలో వివిధ రాష్ట్రాల్లో దాదాపు 25 వేల కార్యక్రమాలు నిర్వహించామని, హర్ గర్ జెండా కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వాల సహకారం లేకుండా సఫలమయ్యేది కాదన్నారు. కళారూపాల ద్వారా దేశభక్తి, స్వాతంత్ర్య పోరాట ఘట్టాలు త్వరగా ప్రజలకు చేరువవుతాయని కిషన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రతి వ్యక్తి దేశభక్తి, స్వాతంత్ర్య పోరాటం గురించి ప్రచారం చేస్తామని సంకల్పించుకుంటే, ఈ ఉత్సవాల లక్ష్యం నెరవేరుతుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటరీ వ్యవహారాలు, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్, విదేశీ వ్యవహారాలు, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్, పర్యాటక మంత్రిత్వ శాఖ కార్యదర్శి అరవింద్ సింగ్, జాయింట్ సెక్రటరీ ఉమా నండూరి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement