Wednesday, April 24, 2024

ఆగని ఫుట్‌పాత్‌ల‌ ఆక్రమణలు.. ప‌ట్టించుకోని జీహెచ్ ఎంసీ

ప్రభ న్యూస్‌, హైదరాబాద్‌ (ప్రతినిధి) : పాదచారుల భద్రతకోసం ఏర్పాటు చేసిన ఫుట్‌ఫాత్‌లు గ్రేటర్‌ హైదరాబాద్‌లో దర్జాగా ఆక్రమణలకు గురవుతున్నాయి. కూరగాయల నుంచి మొదలుకుని బట్టల దుకాణాలు, సెల్‌ఫోన్‌ షాపులు, చెప్పుల దుకాణాలు తదితర చిన్నాచితకా వ్యాపారులు పుట్‌పాత్‌లపై తిష్ట వేశారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ముందు అల్ఫా హోటల్‌నుంచి మొదులకుని రేతిఫైల్‌ బస్టాండ్‌ వరకు ఏర్పాటు చేసిన ఫుట్‌ ఫాత్‌లను సెల్‌ఫోన్‌, చెప్పులు, పండ్లు, ఇతర వ్యాపారులు ఆక్రమించడంతో సాయంత్రం పూట పాదాచారులు నడవ డానికి స్థలం లేకుండా పోతోంది. కోఠీ, సుల్తాన్‌ బజార్లో ఏర్పాటు చేసిన ఫుట్‌ఫా త్‌పై రెడీమేడ్‌ బట్టలు, బ్యాగులు, గాజులు, సెల్‌ఫోన్‌, బుక్‌స్టాల్స్‌ తదితర చిన్న చిన్న వ్యాపారాలు వెలిశాయి.

అమీర్‌పేట, దిల్‌సుఖ్‌నగర్‌లలో రెండు వైపుల ఏర్పాటు చేసిన పుట్‌ ఫాత్‌లను చిరు వ్యాపారలు ఆక్రమించడంతో ఉదయం, సాయంత్రం పూట రద్దీ సమయంలో పాదచారులకు నరకం కనిపిస్తోంది. ప్రధాన కూడళ్లు, ఇతర రద్దీ ప్రాంతాల్లో వీధి వ్యాపారుల ఆక్రమణలు ఒకవైపు ఉంటే మరో వైపు ఆయా షాపుల యజమానులు తమ వాహనాలకు పార్కింగ్‌ స్థలాలుగా ఫుట్‌ పాత్‌లను వాడుకుంటున్నారు. ఒక బస్సుదిగి మరో బస్టా ప్‌లకు వెళ్లాల్సిన ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. షాపింగ్‌ సమయాల్లో ద్విచక్రవాహనాలు, ఆటోలు, కార్లనుసైతం ఫుట్‌ఫాత్‌లను ఆక్రమించి నిలపడంతో పాదచారులు నడవడానికి కనీస స్థలం లేక నానా అవస్థలు పడుతున్నారు.

పట్టించుకోని జీహెచ్‌ఎంసీ..

ప్రమాదరహిత ప్రయాణమే లక్ష్యంగా నగర రహదారుల వ్యవస్థను తీర్చి దిద్దాల్సిన బల్దియా అధికారులు తమ కేమి పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్‌ నగరంలో ట్రాఫిక్‌ రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావుతో పాటు సంబంధిత మంత్రి కేటీఆర్‌సైతం పలు సందర్భాల్లో సూచించినప్పటికీ జీహెచ్‌ఎంసీ అధికారుల్లో చలనం లేదు. పాదచారుల కోసం కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన ఫుట్‌ పాత్‌లను దుకాణదారులు, చిన్నా చితక వ్యాపారులు ఆక్రమించి దందా కొనసాగిస్తున్నారు. చిరు వ్యాపారులకోసం ప్రత్యేక సముదా యాలను ఏర్పాటు చేయడం ద్వారా ఫుట్‌పాత్‌ల ఆక్రమణలకు అడ్డుకట్ట వేస్తామని గతంలో ఆర్బాటంగా ప్రకటించిన జీహెచ్‌ఎంసీ ఆవైపు ప్రయత్నాలను అటకెక్కించింది. కొత్త ఫుట్‌ ఫాత్‌లు, ప్రత్యామ్నాయ మార్గాలు దేవుడెరుగు ఉన్న పుట్‌ఫాత్‌లను ఆక్రమణల నుంచి కాపాడాలని పాదచారులు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement