Tuesday, March 26, 2024

పంజా విసురుతున్న అసంక్రమిత వ్యాధులు.. నిర్లక్ష్యం చేస్తే ఆరోగ్యానికి దెబ్బే

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : అసంక్రమిత వ్యాధులను (నాన్‌ కమ్యూకబుల్‌ డిసీజెస్‌ – బీపీ, షుగర్‌, క్యాన్సర్‌, ఊబకాయం తదితర వ్యాధులు) తేలిగ్గా తీసుకోవద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరించింది. బీపీ, షుగర్‌ తదితర అంసక్రమిత వ్యాధులకు కారణమవుతున్న పొగాకు ఉత్పత్తులు (సిగరేట్‌, గుట్కా, పాన్‌పరాక్‌ తదితర), అల్కాహాల్‌ అమ్మకాలు, కొనుగోళ్లపై నిషేధం విషయంలో సీరియస్‌గా నిర్ణయం తీసుకోవాల్సిన సమయమిదని స్పష్టం చేసింది. కొవ్వును పెంచే ఆహారపదర్ధాల అమ్మకాలనూ నియంత్రించాలని ప్రభుత్వాలకు స్పష్టం చేసింది. లేనిపక్షంలో ఆరోగ్య విపత్తు ముంగిట ప్రపంచం నిలవక తప్పదని, ప్రత్యేకించి దక్షిణాసియా దేశాలు అసంక్రమిత వ్యాధుల ముప్పు తీవ్రంగా పొంచి ఉందని స్పష్టం చేసింది.

నాన్‌ కమ్యూకబుల్‌ డిసీజెస్‌ను నియంత్రించేందుకు ప్రజలు పండ్లు, కూరగాయలతో కూడిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకునేలా ప్రోత్సహించాలని, మసాలాలు, ఉప్పు, చక్కెర, కొవ్వు పదర్థాలు ఎక్కువగా ఉండే ఆహార పదర్థాల అమ్మకాలపై ఆంక్షలు విధించాలని సూచించింది. అదే సమయంలో పండ్లు, కూరగాయల ధరలు సామాన్య, పేదలకు అందుబాటులో ఉండేవిధంగా సబ్సిడీలు, ఇతర ప్రోత్సాహకాలను అందించాల్సిన అవసరం ఎంతో ఉందని డబ్ల్యూహెచ్‌వో గుర్తు చేసింది. జాతీయ ఉప్పు రహిత ఆహార పదర్థాల వినియోగంపై ప్రత్యేక పాలసీని రూపొందించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పింది. ప్రజలంతా సులువుగా వ్యాయామం చేసుకునేలా పబ్లిక్‌ పార్కుల్లో ప్రత్యేక స్థలాన్ని కేటాయించాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం వివిధ దేశాలు, రాష్ట్రాలు నిర్వహిస్తున్న పోషకాహార, హెచ్‌ఐవీ, టీబీ ఆరోగ్య కార్యక్రమాల మాదిరిగానే అసంక్రమిత వ్యాధుల కట్టడి కార్యక్రమాన్ని చేపట్టాలని నొక్కి చెప్పంది.

ఏటా జాతీయ పాఠశాల సర్వే (13-17 ఏళ్ల విద్యార్థులు) నిర్వహించాలని, తద్వారా పొగాకు , ఆల్కహాల్‌ వినియోగం సరళి తెలియడంతోపాటు వ్యాయామం ఏమేర అందుతుందో కూడా తెలుసుకోవచ్చని సూచించింది. పొగాకు, మద్యం అమ్మకాలపై కఠినమైన నియంత్రణా విధానాలను తేవాలని డబ్ల్యూహెచ్‌వో స్పష్టం చేసింది.

డ బ్ల్యూహెచ్‌వో హెచ్చరికల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణలో బీపీ, షుగర్‌, క్యాన్సర్‌ తదితర అసంక్రమిత వ్యాధుల బాధపడుతున్న వారి శాతం జాతీయ సగటు కన్నా ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. దేశ అసంక్రమిత వ్యాధిగ్రస్థుల శాతం సగటున 11.62 శాతం ఉండగా తెలంగాణ, ఏపీలో అది 16.19శాతంగా ఉంది. ఆహార వినియోగ శైలి మారడం, పని ప్రదేశంలో కాలుష్యం, మానసికంగా అధిక ఒత్తిడి, పొగాకు, మద్యం వినియోగం తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతోందని తేలింది. పేద, ధనిక, పరిమనెంట్‌ ఉద్యోగులు, రోజువారీ కార్మికులు అనే తేడా లేకుండా ఇటీవలికాలంలో బీపీ, షుగర్‌, క్యాన్సర్‌ బారిన పడుతున్నారని నిజామాబాద్‌ మెడికల్‌ కళాశాల క్రిటికల్‌ కేర్‌ విభాగం అధిపతి, తెలంగాణ ప్రభుత్వ బోధనా వైద్యుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్‌ కిరణ్‌ మాదల స్పష్టం చేస్తున్నారు. అసంక్రమిత వ్యాధుల కట్టడికి బాల్యం నుంచే మంచి పౌష్టికరమైన ఆహారంతోపాటు తగిన వ్యాయామం, శారీరక శ్రమను అలవర్చుకోవాలని, అప్పుడు దీర్ఘాయిష్సు సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement