Friday, April 19, 2024

స్టీల్‌ప్లాంట్‌లో కొత్త నియామకాలపై ఎలాంటి ఆంక్షల్లేవు : కేంద్రం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : విశాఖ  రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్‌ (ఆర్ఐఎన్ఎల్‌)లో కొత్త నియామకాలపై ఎలాంటి ఆంక్షల్లేవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగుల దీర్ఘకాలిక పదవీ విరమణ సమస్యపై బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు పార్లమెంట్‌లో ప్రశ్నించారు. విశాఖ ఉక్కు కర్మాగారంగా పేరొందిన రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్‌లో ప్రతి సంవత్సరం పెద్దఎత్తున పదవీ విరమణ జరుగుతున్న ఉద్యోగుల సమస్య వల్ల తగ్గిపోతున్న మానవ వనరుల పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలని, దాని ద్వారా తలెత్తే ఇతర సమస్యలపై ఆయన అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే సమాధానమిచ్చారు.

పూర్తి స్థాయి కార్యకలాపాల కోసం ఉద్యోగుల పునర్వ్యవస్థీకరణ చేస్తామని, మిగతా కార్యకలాపాలకు  ఔట్ సోర్సింగ్‌ సిబ్బందిని తీసుకుంటామని ఎంపీకి తెలిపారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో ప్రస్తుతం 14,880 మంది ఉద్యోగులున్నారని వెల్లడించారు. గత మూడేళ్లలో 1,987 మంది ఉద్యోగులు పదవీ విరమణ చేశారని, వచ్చే మూడేళ్లలో 1,170 మంది ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులు, 2,039 మంది నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులు సహా 3,209 మంది ఉద్యోగులు ఆర్ఐఎన్ఎల్ రికార్డుల ప్రకారం పదవీ విరమణ చేయనున్నారని కేంద్ర మంత్రి తెలిపారు. 

పెద్ద ఎత్తున ఉద్యోగుల పదవీ విరమణ కారణంగా ఏర్పడుతున్న సిబ్బంది కొరతను విశాఖ స్టీల్ ప్లాంట్ ఎలా ఎదుర్కొంటుందని  జీవీఎల్ అడగ్గా… అంతగా ప్రాధాన్యం లేని కార్యకలాపాలను ఔట్ సోర్సింగ్, ప్రధాన కార్యకలాపాల్లో సిబ్బందిని పునర్వ్యవస్థీకరణ ద్వారా మానవ వనరుల అవసరాలను తీరుస్తున్నామని పేర్కొన్నారు. గత మూడేళ్లలో 106 మంది కొత్త ఉద్యోగులను నియమించినట్టు నియమించామని ఫగ్గన్ కులస్తే వెల్లడించారు. ఆర్ఐఎన్ఎల్‌లో ఉద్యోగుల సంఖ్య తగ్గినప్పటికీ మంచి పనితీరు కనబరిచిన ఉద్యోగుల కృషిని ఆయన ప్రశంసించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ సిబ్బందికి సంస్థపై గల అభిమానం, నిబద్ధత వల్లే ఆ స్థాయి ఉత్పాదకత సాధ్యమైందని వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement