Friday, April 19, 2024

సుప్రీంకోర్టులో మరో పిటిషన్ వేయలేదు.. 24 వరకు వేచి చూస్తా : కవిత

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: సుప్రీంకోర్టులో తాను దాఖలు చేసిన పిటిషన్‌పై తక్షణమే విచారణ చేపట్టాలని కోరినట్టుగా వచ్చిన వార్తలను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఖండించారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా స్పందించిన ఆమె, తన పిటిషన్‌పై మార్చి 24 వరకు వేచి చూస్తానని స్పష్టం చేశారు. శుక్రవారం సుప్రీంకోర్టులో ఎలాంటి పిటిషన్ వేయలేదని ఆమె స్పష్టం చేశారు. మరోవైపు మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం తమ పార్టీ ఎంపీలు పార్లమెంటులో సైతం పోరాటం చేస్తారని కవిత అన్నారు. రష్యా ప్రభుత్వ అధికారిక వార్తా సంస్థ స్పుత్నిక్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహిళా రిజర్వేషన్లపై తన అభిప్రాయాలు పంచుకున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎటువంటి చొరవ తీసుకోవడం లేదని మండిపడ్డారు. భారతీయ జనతా పార్టీ ఇచ్చిన హామీని విస్మరించిందని విమర్శించారు.

రాజకీయ రంగంలో మహిళల ప్రాతినిధ్యం పెరుగుతేనే దేశం సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. అధికార పార్టీ 2014 ఎన్నికల ముందు మహిళా రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చిందని, కానీ  అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ ఇచ్చిన హామీని విస్మరించిందని విమర్శించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకురావాలని తమ పార్టీ ఎంపీలు తరచూ కేంద్ర ప్రభుత్వంపై డిమాండ్ చేశారని తెలిపారు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం పెడచెవిన పెట్టింది. తొలిసారి మహిళా రిజర్వేషన్ బిల్లును 1996లో అప్పటి ప్రధాన మంత్రి దేవే గౌడ పార్లమెంట్లో ప్రవేశపెట్టారని, ఆ తర్వాత వచ్చిన ప్రధాన మంత్రులు ఈ బిల్లును ఆమోదించడానికి ప్రయత్నాలు చేశారని గుర్తు చేశారు.

ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురావడానికి ఏ మాత్రం చొరవ చూపలేదని మండిపడ్డారు. మహిళలకు రిజర్వేషన్ కల్పించడంలో రాజకీయ చిత్తశుద్ధి అవసరమని అన్నారు. రిజర్వేషన్ కోటాలో కోట కావాలని కొన్ని రాజకీయ పార్టీలు అభ్యంతరం పెడుతున్నాయని, ఇటువంటి సమస్యలను పరిష్కరించడానికి తమ పార్టీ కేంద్రానికి సూచనలు ఇచ్చిందని తెలిపారు. ముఖ్యంగా కులగణన చేపట్టి ఓబీసీ జనాభా లెక్కలు తేల్చాలని తమ పార్టీ డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు. జనాభా లెక్కలు అందుబాటులో ఉంటే రిజర్వేషన్ల అమలు సులభం అవుతుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో తమ ప్రభుత్వం రాష్ట్రంలో ఇంటింటి సర్వే నిర్వహించి కులాల వారీగా జనాభా లెక్కలు సేకరించామని గుర్తు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement