Thursday, April 25, 2024

ఎన్ని చర్యలు తీసుకున్నా.. రాష్ట్రంలో కొనసాగుతున్న డెంగీ వ్యాప్తి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలు వైద్య, ఆరోగ్యశాఖ ఎన్ని చర్యలు తీసుకున్నా రాష్ట్రంలో డెంగీ విజృంభిస్తూనే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ రోజూ కొత్తగా దాదాపు 100దాకా కొత్త డెంగీ కేసులు నమోదవుతున్నాయి. అధికారికంగానే ప్రతీ రోజూ వంద కేసులు నమోదవుతుండగా…అనధికారికంగా వైద్య, ఆరోగ్యశాఖ లెక్కల పరిధిలోకి రాని కేసులు ఇంకా వందల సంఖ్యలోనే ఉంటాయన్న ఆందోళన వైద్యవర్గాల్లో వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో ప్రతీ రోజూ నమోదవుతున్న డెంగీ కేసుల్లో మెజారిటీ కేసులు హైదరాబాద్‌ నగర పరిధిలోనే నమోదవుతుండడంతో నగరంలో పరిస్థితి ఆందోళన కరంగా ఉందని వైద్య, ఆరోగ్యశాఖవర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. హైదరాబాద్‌తోపాటు పరిసర నగర జిల్లాలైన రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాల్లో డెంగీ కేసుల విస్పోటనం కొనసాగుతోంది.

రాష్ట్ర వ్యాప్తంగా డెంగీ బారిన పడిన వారిలో 70శాతం మందికి ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించనిదే వారిలో ప్లేట్‌లెట్స్‌ పెరగని పరిస్థితి నెలకొంది. వాస్తవానికి ఒకసారి డెంగీ సోకిన వ్యక్తికి చికిత్స అనంతరం శరీరంలో ఆ దోమకాటు వైరస్‌ను ఎదుర్కొనే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ప్రస్తుతం డెంగీలోనే నాలుగు రకాల స్ట్రెయిన్‌లు తెలంగాణలో వ్యాప్తిలో ఉన్నాయి. ఇందులో రెండు స్ట్రెయిన్లు ప్రజలను ఎక్కువగా ఇబ్బందిపెడుతున్నాయి. కాని ప్రస్తుతం డెంగీ బారిన పడుతున్నవారిలో ఎక్కువగా రెండోసారి డెంగీ బారిన పడుతున్నవారే అధికంగా ఉంటున్నారని పలు ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రుల వైద్యులు చెబుతున్నారు.

జీహెచ్‌ఎంసీ, రంగారెడ్డి జిల్లాల్లో ప్రతీ ఇంట్లో దాదాపు అందరూ డెంగీ బారిన పడుతున్న ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. పరిసరాల పరిశుభ్రత, దోమకాటు నివారణా జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఏదో ఒక సమయంలో డెంగీ దోమకాటుబారిన పడుతున్నామని పలువురు పేషెంట్లు వాపోతున్నారని పలు ప్రయివేటు ఆసుపత్రుల వైరాలజీ నిపుణులు చెబుతున్నారు. డెంగీ వ్యాప్తికి కారణమవుతున్న ఈడిస్‌ ఈజిప్టు దోమ దోమల నివారణా కాయిల్స్‌, రిపెలర్స్‌ కు లొంగడం లేదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రంలోని ఏజెన్సీ జిల్లాలైన ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్‌, ఆసీఫాబాద్‌ జిల్లాల్లో డెంగీ మరణ మృదంగం కొనసాగిస్తోంది.

గతేడాది కంటే ఈ ఏడాది డెంగీ బారిన పడుతున్న వారిలో ప్లేట్‌లెట్స్‌ ప్రమాదకరస్థాయిలో వేగంగా పడిపోతున్నాయి. ఉదయం డెంగీ జ్వరంతో బాధపడుతున్న వ్యక్తి సాయంత్రంకల్లా తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. చాలా మందిలో ప్లేట్‌లెట్స్‌ 12వేల దిగువకు పడిపోతున్నాయని వైద్యులు చెబుతున్నారు. ప్లేట్‌లెట్స్‌ 40వేల దిగువకు పడిపోయిన వారిని అబ్జర్వేషన్‌లో ఉంచాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement