Friday, April 26, 2024

పీవోపీ విగ్రహాలపై నిషేధం లేదు.. హుసేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయొద్దు : హైకోర్టు ఆదేశం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో ప్లాస్టర్‌ ఆప్‌ ప్యారిస్‌ (పీవోపీ) వినాయక విగ్రహాల తయారీపై నిషేధం లేదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. పీవోపీ విగ్రహాలను హుసేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయోద్దని, జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసిన ప్రత్యేక కుంటల్లోనే నిమజ్జనం చేయాలని పేర్కొంది. పీవోపీ విగ్రహాల నిషేధంపై గతంలో మార్గదర్శకాలను జారీ చేసిన కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి. పీసీబీ మార్గదర్శకాలను సవాల్‌ చేస్తూ విగ్రహ తయారీదారులు దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం హైకోర్టు విచారించింది. పీవోపీ విగ్రహాలు నిషేధిస్తూ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి జీవో ఇవ్వలేదన హైకోర్టు పేర్కొంది. విగ్రహాల ఎత్తు తగ్గించేలా ఉత్తర్వులు ఇవ్వాలన్న ప్రభుత్వ అభ్యర్థననూ హైకోర్టు తోసిపుచ్చింది. దుర్గా పూజపై పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వ మార్గదర్శకాలను పరిశీలించాలని హైకోర్టు సూచించింది.

హైకోర్టు తీర్పు పట్ల విగ్రహతయారీ దారులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రతి ఏటా పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికారులు ఆంక్షల పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారని ధూళ్‌పేటలోని విగ్రహాల తయారీదారులు వాపోయారు. కరోనా కారణంగా రెండేళ్ళుగా విగ్రహాలు అమ్ముడు పోలేదని, ఈ దఫా కాస్త విగ్రహాలకు డిమాండ్‌ ఉన్న నేపథ్యంలో పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికారులు నిబంధనల పేరుతో విగ్రహాల తయారీ పనులకు ఆటంకాలను కలిగిస్తున్నారని వివరించారు. కరోనా కంటే ముందు తయారు చేసిన కొన్ని విగ్రహాలను ఈ దఫా తీర్చి దిద్ది విక్రయించుకునేందుకు సిద్దమవుతుంటే అధికారులు ఆటంకాలను సృష్టించడంతో విధి లేని పరిస్థితులలో కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని వారు పేర్కొన్నారు. కోర్టు తీర్పు తమకు కొంత ఊరటను ఇచ్చిందని వారు ఆనందం వ్యక్తం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement