Thursday, April 25, 2024

రెండు వేల కోట్లతో కొత్త రోడ్లు, వంతెనలు.. నాబార్డు నిధులతో ప్రణాళికలు

అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో : ఏపీ రాష్ట్రవ్యాప్తంగా రహదారులను అధునీకరించేందుకు రోడ్లు భవనాల శాఖ కసరత్తు చేస్తోంది. అందుకోసం సరికొత్త ప్రణాళికలను రూపొందించింది. బడ్జెట్‌లో నిధుల కేటాయింపుతోపాటు వివిధ పథకాల ద్వారా మరిన్ని నిధులను సమకూర్చుకుని రానున్న ఏడాదిలోపు అన్ని ప్రాంతాల్లోని రహదారుల రూపు రేఖలను మార్చేసి కొత్త కళను తీసుకురావాలని యోచిస్తోంది. అందులో భాగంగానే జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నబార్డ్‌) ద్వారా రూ. 2 వేల కోట్ల మేర రుణాన్ని సమకూర్చుకుని ఆ నిధులతో కొత్త రోడ్లను ఏర్పాటుచేయడంతోపాటు అవసరమైన ప్రాంతాల్లో వంతెనలు నిర్మించాలని సంకల్పించింది.

అదేవిధంగా కాలంచెల్లిన వంతెనల స్థానంలో కొత్త వంతెనలను నిర్మించడంతోపాటు ప్రధాన రహదారుల్లో అవసరమైన ప్రాంతాల్లో వంతెనలను ఆధునీకరించం వంటి కార్యక్రమాలను శరవేగంగా చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అందుకు అవసరమైన కార్యాచరణ కూడా ప్రారంభమైంది. రాష్ట్రంలోని ఉమ్మడి 13 జిల్లాల పరిధిలో ఆర్‌ అండ్‌ బీ శాఖకు సంబంధించి 46,238 కి.మీ. పొడవైన రహదారులున్నాయి. అలాగే 8,614 కి.మీ. జాతీయ రహదారులు కూడా రోడ్ల భవనాల శాఖే పర్యవేక్షిస్తుంది దీంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 54 వేల కి.మీ.పైగా రహదారులను పర్యవేక్షించాల్సిన బాధ్యత రోడ్ల భవనాల శాఖపై ఉంది.

ఈనేపథ్యంలోనే బడ్జెట్‌లో కేటాయిస్తున్న నిధులతో శాఖ పరిధిలోని రహదారుల పర్యవేక్షణ భారంగా మారుతుంది. ప్రతి ఏటా వర్షాకాలంలో ప్రధాన రహదారులు పూర్తిగా దెబ్బతింటున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వంతెనలు కూడా కొట్టుకుపోతున్నాయి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఆర్‌ అండ్‌ బీ శాఖకు బడ్జెట్‌లో కేటాయింపులు మరింత పెంచాలని ఆ శాఖ నుండి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి ఏటా ప్రతిపాదనలు అందుతూనే ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత బడ్జెట్‌లో ఆశాఖకు కొంతమేర కేటాయింపులు పెంచడంతోపాటు నాబార్డు ఇతర పథకాల ద్వారా రుణాన్ని అందించే ప్రయత్నం కూడా జరుగుతుంది. ఆ నిధులు అందుబాటులోకి రాగానే సంబంధిత ప్రతిపాదనలకు ఆమోదం తెలపడం ద్వారా పనులను ప్రారంభించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement