Thursday, April 25, 2024

గృహ విక్రయాల్లో సరికొత్త రికార్డ్‌లు.. హైదరాబాద్‌లో 87 శాతం వృద్ధి

దేశంలో నివాస గృహలకు డిమాండ్‌ పెరుగుతునే ఉంది. వడ్డీ రేట్లు పెరుగుతున్నా, దాని ప్రభావం పెద్దగా ఈ రంగంపై పడలేదని ప్రాపర్టీ కన్సల్టెంట్‌ సంస్థ ఆన్‌రాక్‌ విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. దేశంలో ఏడు ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాలపై ఈ సంస్థ సర్వే నివేదికను విడుదల చేసింది. 2022లో రికార్డ్‌ స్థాయిలో అమ్మకాలు నమోదయ్యాయి. దీంతో 2014లో ఉన్న రికార్డ్‌ను 2022 అమ్మకాలతో అధిగమించింది. రుణాల వడ్డీ రేట్లు పెరిగినా గృహాలకు డిమాండ్‌ మాత్రం తగ్గలేదు. కొవిడ్‌ ముందు నాటి పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆన్‌రాక్‌ నివేదిక వ్యాఖ్యానించింది. 2021లో మొత్తం 2,36,500 యూనిట్ల గృహ విక్రయాలు జరిగాయి. 2022లో 54 శాతం వృద్ధితో 3,64,900 యూనిట్ల అమ్మకాలు జరిగాయని పేర్కొంది.

ఢిల్లి ఎన్‌సీఆర్‌ ప్రాంతం, ముంబై మెట్రోపాలిన్‌ రీజియన్‌, చెన్నయ్‌, కోల్‌కతా, బెంగళూర్‌, హైదరాబాద్‌, పుణే నగరాలలో ఈ సర్వే నిర్వహించింది. ఈ ఏడు నగరాల్లో 2014లో 3.43 లక్షల గుహాల విక్రయాలు జరిగాయి. ఇప్పటి వరకు ఇదే రికార్డ్‌, ఈ సంవత్సరం అత్యధిక అమ్మకాలతో ఈ రికార్డ్‌ చెరిగిపోయింది. ఈ సంవత్సరం అత్యధికంగా ముంబై మెట్రో రీజియన్‌లో గత ఏడాది కంటే 44 శాతం పెరిగి 1,09,733 యూనిట్ల ఇళ్లు అమ్మకాలు జరిగాయి. 63,712 యూనిట్లతో ఢిల్లి ఎన్‌సీఆర్‌ రెండో స్థానంలో ఉంది. పుణేలో గత సంవత్సరం 35,975 యూనిట్ల విక్రయాలు జరిగితే ఈ సారి 59 శాతం పెరిగి 57,146, బెంగళూర్‌లో గత ఏడాది 33,084 యూనిట్ల విక్రయాలు జరిగితే, ఈ సారి 50 శాతం వృద్ధితో 49,478 ఇళ్ల అమ్మకాలు జరిగినట్లు ఆన్‌రాక్‌ తెలిపింది. హైదరాబాద్‌లో గత సంవత్సరం 25,406 యూనిట్ల అమ్మకాలు జరిగాయి.

ఈ సంవత్సరం 87 శాతం వృద్ధితో 47,487 యూనిట్లు విక్రయాలు జరిగాయి. చెన్నయ్‌లో 29 శాతం వృద్ధితో 16,097 యూనిట్లు, కోల్‌కతాలో 62 శాతం వృద్ధితో 21,220 యూనిట్లు ఇళ్ల అమ్మకాలు జరిగాయని పేర్కొంది. నివాస స్థలాల ధరలు, వడ్డీ రేట్లు పెరగడం, భౌగోళిక రాజకీయ అస్థిర పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ సంవత్సరం నివాస గృహాల అమ్మకాలు గణనీయంగా పెరిగాయని ఆన్‌రాక్‌ ఛైర్మన్‌ పురి తెలిపారు. మొత్తం ఏడు నగరాల్లోనూ కొత్త ప్రాజెక్ట్‌ లు 51 శాతం పెరిగినట్లు ఆన్‌రాక్‌ తెలిపింది.. 2021లో 2,36,700 యూనిట్లు ఉండే , 2022 నాటికి 3,57,600 యూనిట్లుకు పెరిగాయి. మొత్తం ఏడు నగరాల్లో ప్రారంభైమన కొత్త ప్రాజెక్ట్‌ ల్లో ఒక్క హైదరాబాద్‌లోనే అత్యధికంగా 54 శాతం ప్రారంభమయ్యాయి.

- Advertisement -

రియల్‌ ఎస్టేట్‌ రంగంలో 2022లో అత్యంత ప్రాధాన్యత కలిగిన సంవత్సరమని ఆన్‌రాక్‌ ఛైర్మన్‌ పురీ చెప్పారు. వడ్డీరేట్లు పెరిగిన తరువాత అక్టోబర్‌- డిసెంబర్‌ కాలంలో మొత్తం 92,160 యూనిట్ల అమ్మకాలు జరిగినట్లు ఆన్‌రాక్‌ తెలిపింది. డిసెంబర్‌ నాటికి అమ్మకం కాని ప్రాపర్టీలు 1 శాతం తగ్గాయని తెలిపింది. ఏడు నగరాల్లో మొత్తం 6,30,953 యూనిట్లు అమ్మకాలు జరగాల్సి ఉందని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement