Thursday, April 25, 2024

Big Story | కొత్త ఇంటి పథకం కీలకమే.. బడ్జెట్‌లో 18వేల కోట్లు.?

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ :గ్రామీణ పేదలకు సొంతింటి కల నెరవేర్చేందుకు సరికొత్త ఇళ్ల పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం రూపొందించి బడ్జెట్‌లో రూ. 18వేల కోట్లను కేటాయింపులు చేయనుంది. ఏప్రిల్‌ నుంచి సొంతింటి పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టనున్నది. తెలంగాణ సర్కార్‌ విప్లవాత్మకంగా నిరుపేదలకు సొంతింటి కల సాకారం దిశగా కృషి చేస్తోంది. గతంలో ఎవరూ అడగకుండానే స్వయంగా డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వం వీలైనంత తొందర్లో ఆయా ఇండ్ల పంపిణీని పూర్తిచేసి గ్రామీణ ప్రాంతాల్లో సొంతింటి పథకానికి చర్యలు తీసుకోవాలని భావిస్తోంది.

ఇప్పటికే పూర్తయిన రెండు పడకల ఇళ్ల పెండింగ్‌ పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించేందుకు జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ఆ తర్వాత సొంతింటికి రూ. 3లక్షల పథకాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదలకు రెండు పడకల ఇళ్ల నిర్మాణాలు చేపట్టి ఉచితంగా యాజమాన్య హక్కులను అందించే అతిపెద్ద కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్న సంగతి విధితమే.

2.91లక్షల ఇండ్లు పూర్తి…

- Advertisement -

రాష్ట్రంలో 2.91 లక్షల డబుల్‌ ఇండ్ల నిర్మాణం చేపట్టేందుకు రూ.18 వేల కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. మున్సిపాలిటీలు, గ్రామాలలో ఇప్పటికే సదరు నిర్దేశిత ఇళ్ల నిర్మాణం తుది దశకు చేరుకున్నాయి. వాటికి మౌళిక సదుపాయాల కల్పనలో భాగంగా రహదారులు, విద్యుత్‌, మంచినీరు, డ్రైనేజీ వంటి సౌకర్యాలు పూర్తి చేసిన ప్రభుత్వం లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగించింది. 2023 జనవరి 15లోపు పెండింగ్‌ స్వల్ప పనులను పూర్తి చేయించి మౌళిక వసతులు కల్పించి లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఆదేశించింది. ఇండ్లను లబ్దిదారులకు అప్పగించే విధంగా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.

అర్హతలివే…

లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని, దారిద్య్ర రేఖకు దిగువన ఉండి తెల్ల రేషన్‌ కార్డు కలిగి ఉండాలని సూచించింది. అద్దె భవనాల్లో నివసిస్తున్న వారు అర్హులని ప్రభుత్వం మార్గదర్శకాల్లో తెలిపింది. ముందుగా గ్రామ సభలు, వార్డు సభలు నిర్వహించి దరఖాస్తులు స్వీకరించాలని, వచ్చిన దరఖాస్తులను సంబంధిత తహశీల్దార్లకు పంపించాలని, క్షేత్రస్థాయిలో దరఖాస్తులను పరిశీలించి అర్హుల జాబితాను కలెక్టర్లకు పంపించాలని తాజా ఆదేశాల్లో పేర్కొంది. అనంతరం జాబితాను కలెక్టర్ల ద్వారా ప్రభుత్వానికి పంపిస్తే క్షుణ్ణంగా పరిశీలించి తుది జాబితా ఖరారు చేయనున్నారు. నిర్మించిన ఇళ్ల కంటే అర్హులైన లబ్ధిదారులు ఎక్కువ ఉంటే లక్కీ డీప్‌ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయాలని, మిగిలిన దరఖాస్తుదారుల జాబితాను వెయిటింగ్‌ లిస్ట్‌లో పెట్టాలని అధికారులు భావిస్తున్నారు.

ఫిబ్రవరి 15లోగా పూర్తి…

ఆయా జిల్లాలలో లక్ష్యంగా పెట్టుకున్న రెండుపడకల ఇళ్ల నిర్మాణ పనుల్లో ఇప్పటికే టెండర్‌ పూర్తి అయి నిర్మాణ దశలో ఉన్న వాటిని వచ్చేనెల 15లోగా పూర్తి చేసేందుకు ఒక నిర్దిష్టమైన కార్యాచరణ ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. నిర్మాణం చివరి దశలో ఉన్నవాటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి మౌళిక సదుపాయాలు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్లు వారం వారం సమీక్ష నిర్వహించి ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడంతోపాటు లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టాలని సూచించారు.

కాంగ్రెస్‌ పాలనలో ఉన్న ‘ఇందిరమ్మ’ పథకం మాదిరిగానే మరో పేరుతో గృహ నిర్మాణ పథకాన్ని ప్రారంభించి లక్ష్యాన్ని చేరుకోవాలని నిర్ణయించారు. సీఎం ఆదేశాల మేరకు గత ఆరు నెలల కాలంగా ఈ అంశంపై అధ్యయనం చేసిన గృహ నిర్మాణశాఖ ఉన్నతాధికారులు తాజాగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. గ్రామాల్లో 75 చదరపు గజాల స్థలం ఉండి గతంలో ఎటువంటి ప్రభుత్వ ఇంటి పథకంలో లబ్దిదారులు కానివారికి రూ. 3లక్షల సాయం అందించాలని నిర్ణయించింది. అయితే గతంలో మాదిరిగా అస్తవ్యస్తంగా కాకుండా అత్యంత పారదర్శకంగా ఈ పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

గ్రామీణ ప్రాంతాలకు ప్రాధాన్యం..

ప్రస్తుతం అమలవుతున్న ‘డబుల్‌ బెడ్‌రూమ్‌’ గృహ నిర్మాణ పథకాన్ని పురపాలిత ప్రాంతాలకే పరిమితంచేసి గ్రామీణ ప్రాంతాల్లో ఈ కొత్త పథకాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ పథకానికి కూడా వందశాతం నిధులను ప్రభుత్వమే ఇవ్వాలనుకుంటున్నప్పటికీ పర్యవేక్షణ బాధ్యతలు, మంజూరు అధికారాలను గ్రామ పంచాయితీలకు అప్పగించాలని సూచనప్రాయ నిర్ణయం తీసుకున్నారు. దశల వారీగా వారికి నిధులు మంజూరు చేస్తూ లక్ష్యం మేరకు ఇళ్ళ నిర్మాణాలను చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఇందిరమ్మ పథకం ద్వారా ఇళ్ళు మంజూరై అస్తవ్యస్త పరిస్థితులతో అసంపూర్తిగానే మిగిలి ఉన్న లబ్ధిదారుల కుటుంబాలన్నింటికీ ఈ సరికొత్త పథకం ద్వారా సంపూర్ణ న్యాయం జరగనుంది. దాదాపు 33 లక్షలకుపైగా ఇళ్ళను మంజూరుచేసి అందులో 80 శాతం పూర్తిచేసినట్లు రికార్డులు చెబుతున్నప్పటికీ ప్రతి గ్రామంలో ఇప్పటికీ 10 నుంచి 20 శాతం కుటుంబాలు సొంతింటికి నోచుకోలేని దుస్థితి నెలకొని ఉంది. అయితే త్వరలో ప్రారంభమయ్యే కొత్త పథకం ద్వారా 100 శాతం సొంతింటి కలను నెరవేర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో అమలు చేయబోతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement