Tuesday, April 16, 2024

టీఎస్‌ ఆర్టీసీ బస్సులకు కొత్త రంగులు.. ప్రయాణికులను ఆకర్షించేందుకు ప్లాన్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : టీఎస్‌ ఆర్టీసీ బస్సులు కొత్త అందాలు సంతరించుకోనున్నాయి. ప్రయాణికులను ఆకర్శించే విధంగా బస్సులను ముస్తాబు చేయాలని సంస్థ నిర్ణయించింది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బస్సులన్నింటికీ కొత్తగా రంగులు వేస్తున్నారు. ఆర్టీసీని లాభాల బాటలో పయనింపజేయాలన్న ఉద్దేశ్యంతో ఆదాయం కోసం ఆర్టీసీ బస్సులపై వాణిజ్య ప్రకటనలు వేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఆ ప్రకటనలను వినైల్‌ షీట్లతో రూపొందించి పోస్టర్లను బస్సులతో అతికించే వారు.

దీంతో బస్సుల అసలు రంగు తెలుసుకోవడం ప్రయాణికులకు కష్టంగా మారింది. ఏది ప్రైవేటు బస్సో, ఏది టీఎస్‌ ఆర్టీసీ బస్సో తెలియకపోవడంతో ప్రయాణికులు ప్రైవేటు బస్సులను ఆశ్రయించడంతో సంస్థ కొంత ఆదాయాన్ని కోల్పోవాల్సి వచ్చింది. గడువు ముగిసిన తరువాత ప్రైవేటు వాణిజ్య సంస్థలు ఆర్టీసీ బస్సులపై వేయించిన పోస్టర్లను తీసివేయడంతో ఆ జిగురు అలాగే ఉండిపోయి దానికి దుమ్ము, ధూళి అంటుకుని బస్సులు అందవిహీనంగా కనిపిస్తున్నాయి. ఆర్టీసీ ఎండీగా సజ్జన్నార్‌ బాధ్యతలు స్వీకరించిన తరువాత సంస్థలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టిన నేపథ్యంలో బస్సులకు కొత్తగా రంగులు వేయించి ప్రయాణికులను ఆకర్శించే విధంగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. బస్సులపై ప్రకటనల విధానాన్ని రద్దు చేయడంతో పాటు ప్రస్తుతం ఉన్న బస్సులన్నింటికీ కొత్తగా రంగులు వేసి మెరిసేలా చేయాలని ఆదేశించారు. ప్రస్తుతానికి టీఎస్‌ ఆర్టీసీలో మొత్తం 9190 బస్సులు ఉండగా, వాటిలో సొంత బస్సులు 6481 కాగా, సంస్థ 2709 బస్సులను అద్దెకు తీసుకుని నడుపుతున్నది.

ఇదిలా ఉండగా, టీఎస్‌ ఆర్టీసీకి రాష్ట్రవ్యాప్తంగా ప్రతి డిపోలో సొంత గ్యారేజీలు ఉన్నాయి. నిపుణులైన సిబ్బంది సైతం ఉన్నారు. ఎండి ఆదేశాల మేరకు ఏ డిపో బస్సులకు ఆ డిపోలోనే సొంత సిబ్బందితో రంగులు అద్దిస్తున్నారు. ఆర్టీసీ ఎండీ ఆదేశాల మేరకు ఏ డిపో బస్సులకు ఆ డిపోలోనే సొంత సిబ్బందితో రంగులు అద్దిస్తున్నారు. ట్రిప్పులకు ఇబ్బంది లేకుండా రోజుకు ఒకటి లేదా రెండు చొప్పున బస్సులను మాత్రమే డిపోలో ఉంచి రంగులు వేస్తున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని బస్సులకు రంగులు వేసే ప్ర్రక్రియ పూర్తి కావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని టీఎస్‌ ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు.

ప్రయాణికులను ఆకర్శించాలంటే టీఎస్‌ ఆర్టీసీ బస్సులకు భిన్న రంగుల డిజైన్‌లు ఉండాలని ఎక్కువ మంది అధికారులు అభిప్రాయం వ్యక్తం చేయడంతో ఆ మేరకు రంగులు వేస్తున్నారు. కాగా, ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికులు వేధింపులకు గురవుతున్నారనే ఫిర్యాదులు రావడంతో అధికారులు కొద్ది రోజుల క్రితం పార్టీషన్‌ తెరలు ఏర్పాటు చేశారు. మహిళలు ముందు వైపుకే పరిమితం కాగా, పురుషులు అటుగా వెళ్లేందుకు వీలు లేకుండా చేయడం దీని ఉద్దేశ్యం. దీంతో మహిళలు కేవలం బస్సు ముందు వైపుకే పరిమితం కావడంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళల సంఖ్య భారీగా తగ్గింది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ బస్సులలో పార్టీషన్‌ విధానానికి సంస్థ స్వస్తి పలికింది. అప్పటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య ఆశించిన స్థాయిలో పెరిగిందని ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement