హైదరాబాద్ – తెలంగాణ ప్రభుత్వం మరో విజయం సాధించింది. ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం గూగుల్, హైదరాబాద్‌లో గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ స్థాపనకు అంగీకరించింది. ఇది భారత్‌లో తొలి సెంటర్‌గా, ఏషియా పసిఫిక్‌లో రెండవదిగా, ప్రపంచవ్యాప్తంగా ఐదవదిగా గుర్తింపు పొందనుంది. గూగుల్ LLC, తెలంగాణ ప్రభుత్వం మధ్య బుధవారం ఈ కీలక ఒప్పందం కుదిరింది. గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ హైదరాబాద్‌ను గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ హబ్‌గా తీర్చిదిద్దనుంది. గూగుల్ సెంటర్ సైబర్ భద్రత, ఆన్‌లైన్ సేఫ్టీ ఉత్పత్తుల రూపకల్పనపై ఫోకస్ చేయనుంది . అధునాతన పరిశోధనలతో పాటు ఎఐ ఆధారిత భద్రతా పరిష్కారాలను అభివృద్ధి చేయడంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది.
సీఎం రేవంత్ రెడ్డి, ఐటి మంత్రి డి శ్రీధర్ బాబు అమెరికాలోని గూగుల్ ప్రధాన కార్యాలయానికి ఆగస్టు 2024లో చేసిన పర్యటన తర్వాత ఈ ఒప్పందానికి నాంది పలికారు. ఈ సెంటర్ స్థాపన కోసం భారత్‌లో వివిధ రాష్ట్రాలు గట్టి పోటీ పడగా, తెలంగాణ ప్రభుత్వం వైపే గూగుల్ మొగ్గు చూపింది.
ఈ సెంటర్ ప్రత్యేకతలివే..
ఇది కటింగ్ ఎడ్జ్ సైబర్ భద్రతా పరిష్కారాలకు గ్లోబల్ స్థాయిలో మార్గదర్శకంగా ఉంటుంది. అంతర్జాతీయ నిపుణులతో కలిసి భారత డిజిటల్ భద్రత సామర్థ్యాలను పెంచడమే లక్ష్యంగా పనిచేస్తుంది. ఈ సెంటర్ స్థానికంగా వేలకొద్దీ ఉద్యోగాలు కల్పించడమే కాక, హైదరాబాద్‌ను సైబర్ భద్రతా టెక్నాలజీ మెట్రోగా తీర్చిదిద్దుతుంది. గూగుల్ హైదరాబాద్‌నుఈ సెంటర్ స్థాపన కోసం ఎన్నుకున్నందుకు గర్విస్తున్నాము అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
ఇది హైదరాబాద్ సైబర్ భద్రతలో గ్లోబల్ హబ్‌గా మారడానికి మరో ముందడుగు అని సీఎం పేర్కొన్నారు. గూగుల్ సిఐఓ రాయల్ హాన్సెన్ మాట్లాడుతూ, హైదరాబాద్ గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ కేంద్రంగా ఎదగగలదు. ఈ భాగస్వామ్యం ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ సైబర్ భద్రతా అవసరాలను తీర్చగలదు అని అభిప్రాయపడ్డారు. ఈ ప్రాజెక్ట్‌తో పాటు గూగుల్ క్లౌడ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, స్మార్ట్ సిటీల అభివృద్ధి, ఏఐ, సైబర్ సెక్యూరిటీ శిక్షణ కేంద్రాలపై కూడా చర్చలు కొనసాగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ ముందడుగు రాష్ట్రాన్ని సైబర్ భద్రతలో గ్లోబల్ లీడర్‌గా నిలబెట్టడానికి దోహదం చేస్తుందని ఐటి శాఖ అభిప్రాయపడింది.