Friday, October 4, 2024

National – మొక్కలు నాటడం లో తెలంగాణ టాప్ – మన్ కి బాత్ లో మోడీ ప్రశంస

న్యూ ఢిల్లీ – దేశంలోని వివిధ ప్రాంతాల్లోని ప్రజల ప్రయత్నాలు, స్ఫూర్తిదాయకమైన కథనాలను మన్‌కీబాత్‌ చూపిస్తోందన్నారు ప్రధాని మోడీ. ఈ కార్యక్రమం ప్రారంభించి పదేళ్లు పూర్తిచేసుకోనున్న నేపథ్యంలో నేటి ఎపిసోడ్‌ తనకు భావోద్వేగమైనదని అన్నారు. సామూహిక శక్తిని ప్రదర్శించే ప్రత్యేక వేదికగా ఈ కార్యక్రమం మారిందన్నారు.మన్‌కీ బాత్‌ ద్వారా తన సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన మీడియాకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. సాధారణంగా మసాలాలేని కంటెంట్‌ను ప్రజలు పట్టించుకోరనే అభిప్రాయం ఉండేదని.. ఈ కార్యక్రమం ఆ అభిప్రాయాన్ని మార్చేసిందన్నారు. స్ఫూర్తిమంతమైన కథలు, ప్రేరణ పొందే వ్యక్తులకు సంబంధించిన విషయాలు తెలుసుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారన్నారు

. నీటి నిర్వహణ గురించి ప్రస్తావించిన ఆయన.. నీటి సంరక్షణ ఎంత కీలకమో వర్షాకాలం సూచిస్తుందని చెప్పారు. నీటి సంరక్షణకు అనేక కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు.20 వేల భాషలకు భారత్‌ పుట్టినిల్లు అని పేర్కొన్న మోదీ.. దేశంలో వాటి పరిరక్షణకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ‘తల్లి పేరిట మొక్క’ కార్యక్రమం విజయవంతంగా సాగుతోందని చెప్పారు. ఈ కార్యక్రమం పేరిట గుజరాత్‌లో 15 కోట్లకు పైగా, యూపీలో 26 కోట్లకు పైగా మొక్కలు నాటినట్లు తెలిపారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలను మెచ్చుకున్నారు. అనుకున్న లక్ష్యం కంటే ఎక్కువగా మొక్కలను నాటడం ద్వారా తెలంగాణ ప్రజలు కొత్త రికార్డు సృష్టించారని అన్నారు. తెలంగాణతోపాటు ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలు కూడా రికార్డు సాధించాయని పేర్కొన్నారు.

- Advertisement -

క్రియేట్‌ ఇన్‌ ఇండియాలో భాగస్వామ్యం కావాలని నూతన ఉత్పత్తుల తయారీదారులకు మోదీ పిలుపునిచ్చారు.భారత్‌ ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న ‘మేకిన్‌ ఇండియా’ కార్యక్రమం ప్రారంభించి పదేళ్లు పూర్తయిందని ప్రధాని అన్నారు. దీంతో ప్రతి రంగంలోనూ ఎగుమతలు పెరిగాయని, విదేశీ సంస్థాగత మదుపరులను ఆకర్షించడంలో ప్రభుత్వం పురోగతి సాధించిందన్నారు.

ఈ కార్యక్రమం స్థానిక తయారీదారులకు సాయపడిందన్నారు. రానున్న పండుగ సీజన్‌లో మేడ్‌ ఇన్‌ ఇండియా ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ప్రజలకు పిలుపిచ్చారు. ఇదిలా ఉండగా.. 2014 అక్టోబర్‌3న మొదటి సారి మన్‌కీ భారత్‌ కార్యక్రమం ప్రారంభించిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement