Friday, April 19, 2024

దేశాభివృద్ధి బీఆర్‌ఎస్‌కే సాధ్యం.. పార్టీ లోక్‌సభా పక్ష నేత నామ నాగేశ్వరరావు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించే సత్తా ఒక్క బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉందని ఆ పార్టీ లోక్‌సభా పక్ష నాయకులు, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు అన్నారు. న్యూఢిల్లీలోని సర్దార్ పటేల్ రోడ్‌లో బుధవారం పార్టీ జాతీయ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం, రాజశ్యామల యాగంలో ముఖ్యమంత్రితో పాటు ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నామా మీడియాతో మాట్లాడుతూ దేశ రాజకీయాల్లో బీఆర్ఎస్ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి అంటూ హర్షం వ్యక్తం చేశారు. దేశంలోని రైతు సంఘాలు, నేతలు, రైతులతో చర్చించి మెరుగైన దేశాభివృద్ధికి  కృషి చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు.

కేసీఆర్ నాయకత్వంలో దేశంలో అనూహ్యమైన మార్పు రాబోతోందని జోస్యం చెప్పారు. కేసీఆర్ మార్క్  తెలంగాణా మోడల్ అభివృద్ది దేశంలో తథ్యమని నొక్కి చెప్పారు. ఇక నుంచి బీఆర్ఎస్ జాతీయ రాజకీయాల్లో మరింత దూకుడుగా వ్యవహరిస్తుందని తెలిపారు. ప్రజా సమస్యలే అజెండాగా బీఆర్ఎస్ దూసుకుపోతోందని నామా తెలిపారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేయాలన్నదే కేసీఆర్ అభిమతమని ఆయన స్పష్టం చేశారు.

- Advertisement -

నరేగా పెండింగ్ బిల్లుల చెల్లింపునకు చర్యలు

రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపి మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పెండింగ్ వేతనాలను సకాలంలో చెల్లించేందుకు చర్యలు చేపట్టినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. నరేగా పరిధిని గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కార్యకలాపాలకు, అర్బన్ ప్రాంతాల్లో అత్యవసర అభివృద్ధి కార్యకలాపాల నిర్వహణకు విస్తరించాలనే ఆలోచన ఏమైనా ఉందా? ఉంటే అందుకు సంబంధించిన సమగ్ర వివరాలు తెలపాలని నామ నాగేశ్వరరావు బుధవారం లోక్‌సభలో ప్రశ్నించారు. ఈ పథకం కింద పనులు చేసిన కార్మికులకు వేతనాల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతున్నట్లు తరచూ వస్తున్న ఫిర్యాదులు కేంద్ర ప్రభుత్వానికి తెలియదా? వేతనాలు సకాలంలో చెల్లించేందుకు తీసుకుంటున్న చర్యలేమిటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి ఆయన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.

వేతనాల చెల్లింపు కోసం నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ప్రామాణిక ఆపరేటింగ్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. వేతనాల చెల్లింపులు నిర్ధారించడానికి ఒక వివరణాత్మక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ( ఎస్ఒపి)ను అమలు చేస్తున్నట్లు తెలిపారు. నమయానికి వేతన చెల్లింపులు జరిపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15 రోజుల్లో వేతనాల చెల్లింపు శాతం 95.43 శాతంగా ఉందని మంత్రి వెల్లడించారు. ఇది డిమాండ్ ఆధారిత పథకమని, జీవనోపాధికి ముందుకు వచ్చిన గ్రామీణ ప్రాంతాల్లోని నైపుణ్యం లేని వయోజన కుటుంబాలకు ఏడాదికి కనీసం వంద రోజులు పని కల్పించడం జరుగుతుందని చెప్పారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement