Saturday, April 20, 2024

వేలంలో మ‌ట్టి..బొద్దింక‌లు-అవి మావేనంటూ ఆల్టిమేటం జారీ చేసిన నాసా

ఆ మ‌ట్టి..బొద్దింక‌లు మావే అంటూ అమెరికా అంత‌రిక్ష సంస్థ నాసా అల్టిమేటం జారీ చేసింది. కేవ‌లం మ‌ట్టి..బొద్దింక‌ల కోసం అల్టిమేట‌మా అనుకుంటున్నారా. అవును ఎందుకంటే ఆ మ‌ట్టి మామూలుది కాదు చంద‌మామ మీద‌నుంచి తీసుకువ‌చ్చారు. అంతేకాదు ఆ మ‌ట్టిపై బొద్దింక‌ల‌తో ప్ర‌యోగాలు చేశారు. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. అమెరికాలోని బోస్టన్ లో ఉన్న ప్రఖ్యాత ఆర్ ఆర్ వేలం శాల. వచ్చే నెల మొదట్లో కొంత మట్టిని, కొన్ని చనిపోయిన బొద్దింకలను వేలానికి పెట్టింది. కొంచెం అటూ ఇటూగా 3.2 కోట్ల రూపాయలు (4 లక్షల డాలర్లు) వస్తాయని అంచనా వేసుకుంది. కేవలం ఇంత మట్టి, బొద్దింకల కోసం అంత డబ్బు ఎందుకంటే.. ఆ మట్టి మామూలుది కాదు. చంద మామ మీది నుంచి తెచ్చినది. దానిపై ప్రయోగం కోసం ఆ బొద్దింకలను వాడారు. కానీ అవి అమెరికా ప్రభుత్వానికి చెందినవని, వెంటనే వేలం ఆపేసి తమకు అప్పగించాలని ఆ దేశ అంతరిక్ష సంస్థ (నాసా) అల్టిమేటం ఇవ్వడంతో వేలం ఆగిపోయింది. 1969లో అపోలో 11 వ్యోమనౌకలో నాసా చంద్రుడిపైకి మనుషులను పంపినప్పుడు అక్కడి మట్టిని భూమ్మీదికి తీసుకొచ్చారు. తేవడం సరే .. ఆ మట్టిలో ఏవైనా గ్రహాంతర సూక్ష్మజీవులు ఉండి, అవి వ్యాపించడం మొదలుపెడితే ఎలాగని నాసా శాస్త్రవేత్తలకు భయం పట్టుకుంది.

దీంతో ఆ మట్టిలో కొన్ని బొద్దింకలను వేసి పరిశీలించారు. బొద్దింకలు ఆ మట్టిని తినేలా చేశారు. ఏవైనా గ్రహాంతర సూక్ష్మజీవులు ఉంటే.. బొద్దింకలపై ప్రభావం కనబడుతుందని భావించారు. మట్టిని తిన్న తర్వాత సదరు బొద్దింకలపై పలు రకాల పరీక్షలు చేశారు. ఇదంతా యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసోటాకు చెందిన మరియన్ బ్రూక్స్ అనే శాస్త్రవేత్త ఆధ్వర్యంలో జరిగింది. ఆ మట్టిలో ఎలాంటి గ్రహాంతర సూక్షజీవులు లేవని మరియన్ తన పరిశోధనలో గుర్తించారు. అయితే ఆ మట్టిని, పరిశోధన చేసిన బొద్దింకలను తిరిగి నాసాకు పంపలేదు. ఆయన మరణించాక చంద్రుడి మట్టిని, చనిపోయిన బొద్దింకలను మరియన్ నివాసంలోనే ప్రదర్శించారు. 2010లో ఎవరో మరియన్ కుమార్తె వాటిని ఎవరో ఔత్సాహికులకు అమ్మేసింది. ఇన్నాళ్ల తర్వాత అవి ఆర్ ఆర్ వేలంశాలకు చేరాయి. కానీ అవి తమవేనని నాసా చెప్పడంతో వేలం ఆగిపోయింది. అసలు ఆ మట్టి పరిమాణం కేవలం 40 మిల్లీగ్రాములే. కానీ చంద్రుడి నుంచి తెచ్చిన మట్టి, దానిపై చేసిన పరిశోధనల వివరాలు ప్రైవేటు వ్యక్తుల చేతికి వెళ్లడం సరికాదని నాసా ఈ విధంగా అల్టిమేటం జారీ చేయ‌డం గ‌మ‌నార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement