Saturday, December 7, 2024

TS | ట్రయల్‌ రన్‌ కు సిద్దమైన నార్లాపూర్‌.. ఐదుదశల్లో ఎత్తిపోతల

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: వలసబతుకులకు చిరునామాగా నిలిచిన పాలమూరు.. అభివృద్ధికి అడ్రస్సుగామారే రోజులు కనుచూపుమేరలోనే కనిపిస్తున్నాయి. కృష్ణమ్మ పరుగులకు అడ్డుకట్టవేసి నోళ్లు తెరుచుకున్న బీడుభూముల దాహార్తి తీర్చేందుకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు చివరి అంకంలోకి అగుపెట్టి ప్రారంభోత్సవానికి చేరువయ్యాయి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో అంతర్భాగమైన రిజర్వాయర్ల నిర్మాణంలో నిమగ్నమయ్యారు. తొలివిడతలో తాగునీరు అందించేందుకు నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకాల్లో నార్లాపూర్‌, ఉద్దండాపూర్‌ రిజర్వాయర్ల కు 145 మెగావాట్ల 10 పంపులు బిగించి ప్రధాన పనులు పూర్తి చేశారు.

కాళేశ్వరం బాహుబలి పంపులు 135 మెగావాట్లు కాగా నార్లాపూర్‌ (అంజనగిరి) రిజర్వాయర్‌ లో బిగించిన పంపులు 145 మెగావాట్ల భారీ బాహుబలిపంపులు. ప్రపంచంలో 145 మెగావాట్ల పంపులను రిజర్వాయర్లకు బిగించిన చరిత్ర కేవలం పాలమూరు ప్రాజెక్టుకే పరిమితం కానుంది. లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రభుత్వ సలహాదారు పెంటారెడ్డి. ట్రాన్స్‌ కో బృందం, చీఫ్‌ ఇంజనీర్‌ అహ్మద్‌ఖాన్‌ మోటార్ల బిగింపులో విజయం సాధించారు. ప్రాజెక్టు నిర్మాణ పనులు ఎప్పటికప్పుడు సీఎం కేసీఆర్‌ సమీక్షిస్తూ సూచనలిస్తూ వేగం పెంచారు.

కృష్ణాబ్యాక్‌ వాటర్‌ నుంచి 269 మీటర్ల నుంచి 735 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోసే అద్భుత ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల 9.20 మీటర్ల లోతు లోంచి 23166 క్యూసెక్కుల నీటిని నార్లాపూర్‌ పంపుహౌజ్‌ ద్వారా ఎత్తిపోస్తారు. ఈ నీరు ఎదుల, వెంకటాద్రి, కురుమూర్తి రాయ, ఉద్దండాపూర్‌ రిజర్వాయర్‌ కు చేరుకుంటాయి. ఈ జలప్రాయాణం చివరి పంపు హౌజ్‌ చేరుకునే సరికి సముద్రమట్టానికి 735 మీటర్ల ఎత్తు ఉంటుంది. ఈ ఎత్తులోఉన్న సాగు భూములు కేవలం వర్షాధార వ్యవసాయానికే పరిమితి కాగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో రెండు పంటలకు పుష్కలంగా నీరు అందనుంది.

- Advertisement -

18 ప్యాకేజీల్లో 5 దశల్లో నీటిని ఎత్తిపోస్తూ ప్రపంచ చరిత్ర సృష్టించేందుకు పాలమూరు రంగారెడ్డి సిద్ధమవుతోంది. తొలిదశలో తాగునీరు అందించడంతో పాటుగా నెలల వ్యవధిలోనే సాగునీరు అందించేందుకు సాగునీటి పారుదల శాఖ రంగం సిద్థం చేసింది. అయితే 11 జూన్‌ 2015న భూత్పూర్‌ దగ్గర పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. తెలంగాణ భూభాగంలో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుతో పర్యావరణ నష్టం జరుగుతోందని ఏపీ తెలంగాణలోని విపక్షాలతో కలిసి గ్రీన్‌ ట్రిబ్యునల్‌ లో 40 కేసులు నమోదు చేయగా వాస్తవాలను కోర్టుకు సమర్పించి అనుమతులు పొందేందుకు దాదాపుగా ఐదు సంవత్సరాలు పట్టడంతో పనులు నిలిచి పోయాయి.

విపక్షాలు గ్రీన్‌ ట్రిబ్యునల్‌ లో కేసునమోదు చేయకపోతే ఇప్పటికే ప్రాజెక్టు పూర్తి అయ్యే అవకాశాలుండేవని జలనిపుణులు చెప్పారు. 6.5 టీఎంసీల నీటి సామర్ధ్యంతో ఎత్తిపోసే నార్లాపూర్‌ రిజర్వాయర్‌ పనుల్లో పంపుల బిగింపు, అప్రోచ్‌ ఛానల్స్‌, సర్జీపూల్‌, ఓపెన్‌ కెనాల్‌, 62 కిలోమీటర్ల భూగర్భ సొరంగ మార్గాలు పూర్తి అయ్యాయి. అలాగే ఎప్పటికప్పుడు పంపుల పనితీరును ఇంజనీర్లు పరిశీలించారు.

ఈ నేపథ్యంలో 31న డ్రెయ్‌ రన్‌, సెప్టెంబర్‌ 15 నాటికి ట్రైయల్‌ రన్‌ నిర్వహించి తాగునీరు అందించాలనే ప్రతిపాదనలో నీటిపారుదలశాఖ కార్యక్రమాలు రూపొందించింది. సీఎం కేసీఆర్‌ 31 ఆగస్టున నార్లాపూర్‌ రిజర్వాయర్‌ పనులను పరిశీలించి డ్రైయ్‌ రన్‌ కు అనుమతి ఇవ్వనున్నట్లు సీఎంఓ అధికారులు చెప్పారు. అలాగే సెప్టెంబర్‌ 15న ట్రైయల్‌ రని నిర్వహించి దశలవారిగా ఎత్తిపోతల పనులను పూర్తి చేసి 70 మండలాల్లోని 1226 గ్రామాలకు తాగునీరు అందించేందుకు ప్రభుత్వం పనుల్లో మరింత వేగం పెంచింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement