Friday, March 29, 2024

నై కిసాన్‌… జై జవాన్‌.. వ్యవసాయం ఇక నిర్వీర్యమే

ఇప్పటికే పలు బాధ్యతల నుంచి తప్పిచుకుంటున్న ప్రభుత్వాలు వ్యవసాయ రంగం నుంచి కూడా వైదొలగేందుకు ప్రయత్నిస్తున్నాయా?.. అంచెలంచెలుగా ఈ రంగంలో ప్రభుత్వ పాత్రను పరిమితం చేసుకుంటున్నాయా అన్న సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. దేశంలో ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ జోరందుకున్న అనంతరం మౌలిక సదుపాయాల రంగం పూర్తిగా వాటి అధీనంలోకి పోయింది. ఈ రంగం నుంచి ప్రభుత్వాలు దాదాపుగా వైదొలిగాయి. భారీ పరిశ్రమల నిర్వహణను ప్రభుత్వాలు ఇప్పుడు కార్పొరేట్‌ కంపెనీలకు అప్పగిస్తున్నాయి. విమానయానాన్ని ప్రైవేటీకరణ చేసేశాయి. పోర్టులు, ఎయిర్‌పోర్టులన్నీ ప్రైవేటు పరమౌతున్నాయి. అంచెలంచెలుగా విద్య, వైద్యరంగాల్లోనూ ప్రైవేటు ఆధిపత్యం పెరిగింది. బ్యాంకులు, ఇన్సూరెన్స్‌ రంగాల్లోకి ఇప్పటికే ప్రైవేటు, విదేశీ సంస్థలు చొరబడ్డాయి. ప్రభుత్వ బ్యాంకుల విలీనం జోరుగా సాగుతోంది. అంచెలంచెలుగా ప్రభుత్వ బ్యాంకులు కూడా సామాజిక బాధ్యత నుంచి బయటపడుతున్నాయి. కీలకమైన వ్యవసాయరంగంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ రంగాన్ని కార్పొరేట్‌ గుప్పెట్లో పెట్టేందుకే మూడు సాగుబిల్లుల్ని అమల్లోకి తేవాలని ప్రయత్నించింది.

ఉత్తరాది రైతుల ఉద్యమ ప్రభావంతో ఈ బిల్లుల్ని కేంద్రం వెనక్కి తీసుకుంది. అంతమాత్రాన సాగుకు ప్రభుత్వాల సహకారం కొనసాగే అవకాశాల్లేవని నిపుణులు తేల్చేస్తున్నారు. అంచెలంచెలుగా వ్యవసాయానికి సహకారాన్ని ప్రభుత్వం పరిమితం చేసుకుంటోంది. దేశ వ్యాప్తంగా ప్రభుత్వాలు అమలుచేస్తున్న జాతీయ ఆహార పంపిణీకి అవసరమైన ఆహార దినుసుల వరకే ప్రభుత్వం బాధ్యత వహిస్తోంది. ఇప్పుడు కేంద్రం బియ్యం, గోధుమ, ఇతర వ్యవసాయోత్పత్తుల కు ప్రకటిస్తున్న కనీస మద్దతు ధర కూడా ఇకముందు బియ్యం, గోధుమలకు మాత్రమే పరిమితమౌతుంది. అది కూడా జాతీయ ఆహార పథకం క్రింద పంపిణీ అయ్యే గింజల సేకరణ వరకే ఈ ధర చెల్లింపు జరుగుతుంది. మిగిలిన ఉత్పత్తుల విక్రయ బాధ్యత సాగుదార్లదే కానుంది.

ఒకప్పుడు కేంద్రం రైతుల నుంచి నేరుగా భారత ఆహార సంస్థ ద్వారా ధాన్యం, గోధుమలు సేకరించేది. వీటికి కేంద్రమే నగదు చెల్లించేది. ఇందుకోసం కనీస మద్దతు ధరను అమలు చేసేది. ఈ ధరను ప్రతి ఏటా కాస్తో కూస్తో పెంచేది. అనంతరకాలంలో కొనుగోలు బాధ్యత నుంచి కేంద్రం తప్పుకుంది. దీన్ని రాష్ట్రాలకు అప్పగించింది. ఇందుకు పైకాన్ని రాష్ట్రాలే రైతులకు చెల్లించాలి. ఈ ధాన్యాన్ని మిల్లుల్లో మరాడించిన అనంతరం కేంద్రం నిర్దేశించిన మేరకు అందించాలి. ఆ తర్వాత దానికి సంబంధించిన మొత్తాన్ని కేంద్రం రాష్ట్రాలకు జమ చేస్తుంది. ఒకప్పుడు ఎరువులు, వంగడాలపై సబ్సిడీలుండేవి. నేరుగా ఉత్పత్తిదార్లకే ఎరువుల సబ్సిడీని కేంద్రం అందించేది. ఈ విధానంలో సబ్సిడీ మొత్తం దుర్వినియోగం అవుతున్నదంటూ కంపెనీ ధరకే రైతులు కొనుగోలు చేస్తే కొంతమొత్తాన్ని వారి ఖాతాల్లో నేరుగా జమ చేసే విధానాన్ని కేంద్రం అమల్లోకి తెచ్చింది. రాన్రాను ఇలా జమౌతున్న మొత్తం తగ్గిపోయింది.

అలాగే కేంద్రం ప్రతి ఏటా నిర్దిష్ట పరిమాణంలో మాత్రం ధాన్యం కొనుగోలుకు నియంత్రణ విధించింది. ఇందుకు కేంద్రం చెబుతున్న కారణం ఇప్పటికే తాము సమీకరించిన వ్యవసాయోత్పత్తుల నిల్వకు తగినన్ని గోదాములు అందుబాటులో లేవని, వాస్తవానికి దేశంలో ఎఫ్‌సీఐ గోదాముల వద్ద రానున్న మూడేళ్ళకు సరిపడే వ్యవసాయోత్పత్తులు నిల్వ ఉన్నాయి. ఇందులో 25శాతం వరకు కుళ్ళి పోవడం లేదా ఎలుకలు, పందికొక్కులు తినేయడం జరిగింది. ఇవికాక కొత్తగా నిల్వ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ఎఫ్‌సీఐ ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. కేంద్రం ఈ విషయంలోనూ తన పాత్రను తగ్గించుకుంటోంది.

ఇదే ఇప్పుడు కేంద్రానికి, వివిధ రాష్ట్రాలకు మధ్య వివాదంగా రూపుదిద్దుకుంది. ఉత్పత్తయిన దినుసులు మొత్తం కొనుగోలు చేయాలంటూ రాష్ట్రాలు పట్టుబడుతున్నాయి. ఇందుకు కేంద్రం ససేమీరా అంటోంది. దేశీయంగా పెరిగిన సాంకేతిక నైపుణ్యం, అందుబాటులోకొచ్చిన ఆధునిక పద్ధతులు, యంత్ర సామాగ్రి కారణంగా దిగుబడులు అనూహ్యంగా పెరిగిపోతున్నాయి. కనీసం వీటిని కొనుగోలు చేసి విదేశీలకు ఎగుమతులు జరిపే అవకాశాన్ని కేంద్రం వ్యాపార సంస్థలకు ఇవ్వడంలేదు. దీంతో ఇప్పుడు రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో ధాన్యం సాగు నుంచి మళ్ళాల్సి వస్తోంది. ఇది ఓ విధంగా రైతును దారిమళ్ళించేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో ఓ భాగంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement