Thursday, April 18, 2024

Delhi: మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికపై కసరత్తు ముమ్మరం.. అభిప్రాయాలు సేకరణ చేపట్టిన అధిష్టానం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: కాంగ్రెస్ పార్టీకి చావో-రేవో అన్నట్టుగా మారిన మునుగోడు ఉప-ఎన్నికల బరిలో ఎవరిని నిలబెట్టాలన్న విషయంపై అధిష్టానం మేధోమథనం మొదలుపెట్టింది. నల్గొండ జిల్లా నేతలతో పాటు రాష్ట్రానికి పలువురు సీనియర్ నేతల అభిప్రాయాలను సేకరిస్తోంది. హుజురాబాద్ ఉప-ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థి ఎంపికపై కసరత్తును వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రకటించాలని చూస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీని వీడి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఏర్పడ్డ ఈ ఉప-ఎన్నికలు కాంగ్రెస్‌కు అత్యంత ప్రతిష్టాత్మకంగా, ప్రాణ సంకటంగా మారాయి. ఈ ఎన్నికల్లో గెలుపొందకపోతే రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీల మధ్యనే ప్రధాన పోరు అన్న పరిస్థితి నెలకొంటుందని అధిష్టానం ఆందోళన చెందుతోంది.

కాంగ్రెస్‌కు గట్టి పట్టున్న దక్షిణ తెలంగాణలో, ముఖ్యంగా నల్గొండ జిల్లాలో ఓడిపోతే దాని ప్రభావం రాష్ట్రమంతటా ఉంటుందని కలవరపడుతోంది. పైపెచ్చు రాష్ట్ర నాయకత్వంపై సీనియర్లలో నెలకొన్న అసంతృప్తి, నేతల మధ్య స్పర్థలు వంటి అంతర్గత సమస్యలు ఎలాగూ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో రాజకీయ ప్రత్యర్థులకు సవాల్ విసిరేలా గట్టి అభ్యర్థిని నిలబెట్టి, గెలుపు కోసం కలసికట్టుగా శ్రమించాలని పార్టీ అధిష్టానం రాష్ట్ర నాయకత్వానికి సూచించింది. అభ్యర్థి విషయంలో నేతల అభిప్రాయాలకు చోటివ్వాలని భావిస్తోంది. ఈ క్రమంలో అధిష్టానం ఇప్పటికే అభిప్రాయ సేకరణ కసరత్తు చేపట్టింది. ఆదివారం జరిగిన ‘మహంగాయీ పర్ హల్లా బోల్’ ఆందోళన కోసం ఢిల్లీ చేరుకున్న నాయకుల అభిప్రాయాలను అధిష్టానం పెద్దలు అడిగినట్టు తెలిసింది.

సీహెచ్ కృష్ణారెడ్డి Vs పాల్వాయి స్రవంతి
రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన మరుక్షణం నుంచే మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి ఎవరన్న ప్రశ్న మొదలైంది. ఈ క్రమంలో దివంగత పాల్వాయి గోవర్దన్ రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతి, చల్లమల్ల కృష్ణా రెడ్డి, పల్లె రవి, కైలాష్ నేత పేర్లు తెరపైకొచ్చాయి. నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యలో ఉన్న బీసీ సామాజికవర్గాల ఓటర్లను దృష్టిలో పెట్టుకుని బీసీ అభ్యర్థులకు టికెట్లు ఇవ్వాలన్న ప్రతిపాదనలు అధిష్టానం వరకు వచ్చాయి. కానీ రాజగోపాల్ రెడ్డిని ఢీకొట్టగలిగే ఆర్థిక సామర్థ్యం, క్యాడర్ మద్ధతు వంటి అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత జాబితా నుంచి ఇద్దరి పేర్లను తొలగించినట్టు తెలిసింది. ప్రస్తుతం కృష్ణా రెడ్డి, స్రవంతి మధ్య పోటీ నెలకొంది. సర్వే ఫలితాలు, స్థానికత, పాల్వాయి గోవర్థన్ రెడ్డి కుటుంబ నేపథ్యం, క్యాడర్ మద్ధతు వంటి అంశాలు స్రవంతికి అనుకూలంగా కనిపిస్తున్నాయి.

వీటికి తోడు పార్టీలో సీనియర్ నేతలు సైతం స్రవంతి అభ్యర్థిత్వానికే తమ ఓటు అంటున్నారు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో అధికారంలో ఉన్న బీజేపీ, టీఆర్ఎస్ అభ్యర్థులతో పోటీపడి ఖర్చు చేయగల్గిన సామర్థ్యం విషయంలో ఆమె వెనుకబడుతున్నారు. ఆర్థికంగా బలంగా ఉన్న కృష్ణారెడ్డి అభ్యర్థిత్వం కోసం గట్టిగా పోటీపడుతున్నారు. ఢిల్లీలో అధిష్టానం పెద్దలతోనూ మంతనాలు సాగిస్తూ లాబీయింగ్ చేసుకుంటున్నట్టు సమాచారం. ఈ పరిస్థితుల్లో అధిష్టానం వీరిద్దరిలో ఒకరిని ఖరారు చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

మనుగోడులో భారత్ జోడో
సెప్టెంబర్ 7 నుంచి భారత్ జోడో యాత్ర తలపెట్టిన రాహుల్ గాంధీ, తెలంగాణలో అడుగుపెట్టే సమయానికి మునుగోడు అభ్యర్థిత్వంపై స్పష్టత వస్తుందని అధిష్టానం పెద్దలు కొందరు చెబుతున్నారు. అప్పటి వరకు అభ్యర్థిత్వంపై కసరత్తు కొనసాగుతుందని వారంటున్నారు. రాహుల్ గాంధీ యాత్ర మొదలుపెట్టిన ఒకట్రెండు వారాల్లో అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయవచ్చునని, తద్వారా ఆయన తెలంగాణలో అడుగుపెట్టిన తర్వాత మునుగోడు మీదుగా యాత్రను కొనసాగిస్తూ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో రాహుల్ గాంధీ పాల్గొనడానికి ఆస్కారం ఉంటుందని భావిస్తున్నారు.

- Advertisement -

రాహుల్ రాకతో మునుగోడు ఎన్నికల ప్రచారంలో ఊపొస్తుందని, ముక్కోణపు పోటీలో కాంగ్రెస్ తన ఓటుబ్యాంకును కాపాడుకోగల్గినా చాలు గెలుపొందవచ్చని నాయకత్వం భావిస్తోంది. కాంగ్రెస్ ఓటుబ్యాంకు చేజారకుండా ప్రచార కార్యక్రమాలను రూపొందించడంపై దృష్టిసారించింది. ఇప్పటికే నియోజకవర్గంలోని వయోధికులను కలిసినప్పుడు కాంగ్రెస్ నేతలు వారి కాళ్లకు నమస్కరిస్తూ సెంటిమెంటుతో కట్టిపడేయాలని చూస్తున్నారు. ‘మన మనుగోడు – మన కాంగ్రెస్’ నినాదంతో ప్రచారపర్వాన్ని వేగవంతం చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement