Friday, April 19, 2024

తక్షణమే ఎంఎస్పీ చట్టాన్ని తీసుకురావాలి.. కేంద్రమంత్రి సమాధానంపై ఎంపీ నామ అసంతృప్తి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : వ్యవసాయ పంటలకు మద్దతు ధర ( ఎంఎస్పీ ) లక్ష్యాలను సాధించడానికి ఎఫ్‌సీఐ, స్టేట్ ఏజెన్సీల ద్వారా గోధుమలకు మద్దతు ధర అందిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఎంఎస్పీ చట్టాన్ని ఎప్పుడు తీసుకొస్తారు? అసలు చట్టం తెచ్చే ఉద్దేశం ఉందా? లేదా? రైతులపై పెట్టిన కేసులను ఎందుకు  ఉపసంహరించుకోలేదు? అంటూ ఖమ్మం ఎంపీ, బీఆర్‌ఎస్ లోక్‌సభా పక్ష నేత నామ నాగేశ్వరరావు అడిగిన ప్రశ్నలకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ మంగళవారం రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఎంఎస్పీ  ద్వారా దేశవ్యాప్తంగా వరి, గోధుమ రైతులు లబ్ధి పొందుతున్నారని ఆయన చెప్పుకొచ్చారు.

వరి, గోధుమల మద్దతు ధర విషయంలో కోట్లాది మంది రైతులు లబ్ధి పొందుతున్నారని తెలిపారు. వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్ సిఫార్సుల మేరకు కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, డిపార్టుమెంట్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని, పంటలకు మద్దతు ధర నిర్ణయిస్తామని కేంద్రమంత్రి చెప్పారే గానీ చట్టాన్ని తీసుకువస్తారో మాత్రం వెల్లడించలేదని నామ నాగేశ్వరరావు ఆసంతృప్తి వ్యక్తం చేశారు. రైతులపై కేసు అంశాలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే చూసుకుంటాయని చెప్పడం ఏమాత్రం సమంజసం కాదన్నారు.

ప్రశ్న ఒకటైతే సమాధానం మరొకటా?

- Advertisement -

ఎకనామిక్ ఆఫ్ ఉమెన్ ఎంట్రప్రెన్యూర్స్ అండ్ సార్టప్ బై విమెన్ ( డబ్ల్యూఈఈ ) పథకానికి సంబంధించి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇచ్చిన సమాధానంపై నామ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రశ్న ఒకటైతే సమాధానం మరొకటి ఇచ్చారన్నారు. డబ్ల్యూఈఈ పథకం కింద దేశంలోని మహిళల ఆర్ధికాభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యలేంటి? లబ్ధి పొందుతున్న మహిళల సంఖ్య, గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల కోసం చేపడుతున్న కోర్సులు, కార్యక్రమాలకు ఏమైన ప్రణాళిక ఉందా ? అని నామ కేంద్రాన్ని ప్రశ్నించారు. కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ డబ్ల్యూఈఈ పథకం కింద చేపడుతున్న కార్యక్రమాలకు జర్మన్ సంస్థ జీఐజీ మద్దతిచ్చి సహకరిస్తోందని తెలిపారు.

కేంద్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ భాగస్వామ్యంతో దేశంలోని మహిళల నేతృత్వంలోని సంస్థల కోసం 2018లో డబ్ల్యూఈఈ ప్రాజెక్టును ప్రారంభించామన్నారు. తెలంగాణ, మహారాష్ట్ర, రాజస్థాన్, తదితర ఎనిమిది రాష్ట్రాల్లో మహిళల వ్యాపార సంస్థలను పెంచడానికి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 908 మంది మహిళా పారిశ్రామికవేత్తలకు డబ్ల్యూఈఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం ఉందని కేంద్రమంత్రి వెల్లడించారు. తెలంగాణలోని 26 జిల్లాల్లో ఈ పథకం అమలులో ఉందని ఆయన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement