Friday, April 19, 2024

Movie: అమలా.. కాజల్.. నాగార్జునకు జోడీ ఎవ‌రో?

ఒకవైపు బిగ్ బాస్‌ హోస్ట్‌గా చేస్తూనే.. మరోవైపు సినిమాలు చేస్తున్నారు టాలీవుడ్ ‘కింగ్’ నాగార్జున. ప్రస్తుతం ప‌లు ప్రాజెక్టుల‌తో ఆయ‌న బిజీబిజీగా ఉన్నారు. బంగార్రాజు సినిమా చేస్తూనే.. ‘ది ఘోస్ట్‌’ షూటింగ్‌లో కూడా పాల్గొంటున్నారు. యువ దర్శకుడు ప్రవీణ్‌ సత్తారు డైరెక్ష‌న్‌లో రూపొందుతున్న ది ఘోస్ట్‌.. విభిన్నమైన యాక్షన్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రానుంది. నారాయణ్‌ దాస్‌ నారంగ్, పుస్కూర్‌ రామ్మోహన్‌ రావు, శరత్‌ మరార్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాలో నాగ్ మాజీ ‘రా’ అధికారిగా కనిపించనున్నారు. ఇప్పటికే చిత్రీకరణ ప్రారంభమైన‌ ఈ సినిమా.. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘ది ఘోస్ట్‌’ సినిమా కోసం దర్శక నిర్మాతలు హీరోయిన్ వేటలో ఉన్నారు.

నాగార్జునకు జోడీగా ముందుగా కాజల్‌ అగర్వాల్‌ ను ఎంపిక చేశారు. అయితే అనుకోని కారణాల వల్ల కాజల్‌ ఈ సినిమా నుంచి తప్పుకున్న‌ట్టు తెలుస్తోంది. ఆపై అమలా పాల్ ను ఎంపిక చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలొచ్చాయి. అయితే ఫైనల్‌గా యువ కథానాయిక మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఫిక్స్‌ అయినట్లు సమాచారం తెలుస్తోంది. ఇప్పటికే చిత్ర బృందం ఆమెతో కథా చర్చలు పూర్తి చేసిందని, స్క్రిప్ట్‌ నచ్చడంతో కింగ్ సరసన నటించేందుకు అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. మెహ్రీన్ ఫిర్జాదా హరియాణా మాజీ సీఎం భజన్ లాల్ మనవడు భవ్య బిష్ణోయ్‌తో జరగాల్సిన వివాహాన్ని రద్దు చేసుకున్న విషయం తెలిసిందే.

పెళ్లి కోసం కొన్ని సినిమాలు వదులుకున్న మెహ్రీన్.. మళ్లీ స్పీడ్ పెంచింది. వరుసగా సినిమాలను ఒప్పుకుంటోంది. ఈ క్రమంలోనే ‘ది ఘోస్ట్‌’ సినిమా కథ నచ్చడంతో నాగ్ సరసన నటించేందుకు ఒప్పుకుందట. మెహ్రీన్ ప్రస్తుతం తెలుగులో ‘ఎఫ్‌ 3’, కన్నడంలో శివరాజ్‌ కుమార్‌ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. తన అందంతో కుర్రకారును ఆకట్టుకుంటున్న మెహ్రీన్.. ‘ది ఘోస్ట్‌’ సినిమాలో ఎలాంటి పాత్రలో నటిస్తుందో చూడాలి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసంఫేస్‌బుక్‌,  ట్విట్టర్   పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement