Monday, March 25, 2024

Weather Alert | రుతుపవనాలు వచ్చేస్తున్నయ్‌.. 48 గంటల్లో కేరళ తీరానికి నైరుతి

వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రాబోయే 48 గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశముందని బుధవారం ప్రకటన విడుదల చేసింది. రుతుపవనాల రాకకు దక్షిణ అరేబియా సముద్రం, లక్షద్వీప్‌, వాయువ్య, ఈశాన్య బంగాళాఖాతంలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. రానున్న 48 గంటల్లో ఇవి కేరళ తీరాన్ని తాకే అవకాశముంది అని సదరు ప్రకటనలో వెల్లడించింది.

అంతకు ముందు రుతుపవనాలు ఆలస్యమయ్యే అవకాశముందంటూ ప్రైవేటు వాతావరణ శాఖ స్కైమెట్‌ అంచనా వేసింది. నైరుతి రుతుపవనాల రాక ఇప్పటికే ఆరు రోజులు ఆలస్యమైంది. ఇప్పుడు అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపోర్‌జాయ్‌ తుపాను కారణంగా, ఈ రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకేందుకు మరో రెండు మూడు రోజులు పట్టే అవకాశముందని స్కైమెట్‌ తెలిపింది. ఈ నేపథ్యంలో భారత వాతావరణ విభాగం చేసిన ప్రకటన సాంత్వన కలిగించేదిగా ఉంది.

- Advertisement -

ఈసారి వారం ఆలస్యంగా..

గతేడాది జూన్‌ 1నే నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. ఈ ఏడాది వారం రోజులు ఆలస్యంగా దేశంలోకి ప్రవేశిస్తున్నాయి. రుతుపవనాల ఆలస్యానికి వాతావరణ మార్పులే కారణమని తెలుస్తోంది. తొలుత జూన్‌ 4 నాటికి తీరం తాకొచ్చని అంచనా వేసినప్పటికీ, ఇంతవరకు రుతుపవనాల జాడలేదు. ఇప్పుడు తుపాను ప్రభావంతో అరేబియా సముద్రంలో రుతుపవనాల కదలికలు బల#హనంగా ఉన్నట్లు వాతావరణ నిపుణులు తెలిపారు. రుతుపవనాల ఆలస్యంతో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈసారి వర్షపాతం కనీసం 5 శాతం దాకా తగ్గవచ్చని అంచనా వేస్తున్నారు.

బలపడుతున్న బిపోర్‌జాయ్‌..

అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపోర్‌జాయ్‌ తుపాను వేగంగా బలపడుతోంది. తీవ్ర తుపానుగా మారిన బిపోర్‌జాయ్‌.. బుధవారం ఉదయం 5.30 గంటలకు గోవాకు 890 కిలోమీటర్ల దూరంలో పశ్చిమాన నైరుతి ప్రాంతంలో, ముంబైకి 1,000 కిలోమీటర్ల దూరంలో నైరుతిలో, పోర్‌బందర్‌కు 1,070 కిలోమీటర్ల దూరంలో దక్షిణాన నైరుతిలో, కరాచీకి 1,370 కిలోమీటర్ల దూరంలో దక్షిణాన కేంద్రీకృతమై ఉంది. రాగల మూడు రోజుల్లో ఇది ఉత్తరాన వాయువ్య దిశలో కదిలే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ తుపాను కారణంగా అరేబియా తీర ప్రాంతాలకు ఎలాంటి పెను ముప్పు లేదని అధికారులు అంచనా వేస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement