Thursday, March 28, 2024

బల్క్ డ్రగ్ పార్క్ కేటాయింపులో తెలంగాణకు మోడీ సర్కార్ మొండి చేయి – కేటీఆర్

బల్క్ డ్రగ్ పార్క్ కేటాయింపులో తెలంగాణకు మోడీ సర్కార్ మొండి చేయి చూపించింద‌ని ఐటీశాఖమంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారకరామారావు ఆరోపించారు. తెలంగాణ పట్ల కేంద్ర సర్కార్ వివక్షపూరిత వైఖరి కొనసాగుతూనే ఉందని.. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బల్క్ డ్రగ్ పార్క్ పథకంలో తెలంగాణకు చోటు దక్కకపోవడమే ఇందుకు సాక్ష్యమ‌న్నారు. బల్క్ డ్రగ్ పార్కుల కేటాయింపులో తెలంగాణకు జరిగిన తీవ్ర అన్యాయాన్ని ఎత్తిచూపుతూ కేంద్ర కెమికల్, ఫెర్టిలైజర్ శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ కు కేటీఆర్ లేఖ రాశారు. లైఫ్ సైన్సెస్ – ఫార్మా రంగాల్లో అంతర్జాతీయ స్థాయిలో దూసుకుపోతున్న దేశ లైఫ్ సైన్సెస్ రాజధాని, వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ హైదరాబాద్ నగరాన్ని కావాలనే విస్మరించిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. బల్క్ డ్రగ్ పరిశ్రమ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలను ఎంపిక చేయడం మోడీ సర్కార్ వివక్షపూరిత రాజకీయాలకు పరాకాష్ట అన్నారు కేటీఆర్. అంతర్జాతీయ ప్రమాణాలతో రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పుతున్న హైదరాబాద్ ఫార్మసిటీ పేరును కనీసం పరిశీలించకుండా తెలంగాణ పట్ల తనకున్న వివక్షను కేంద్ర సర్కార్ బయటపెట్టుకుందని కేటీఆర్ విమర్శించారు.

బల్క్ డ్రగ్ పార్క్ ను తెలంగాణకు కేటాయించాలని కేంద్ర ఫార్మాసూటికల్ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రతిపాదనలను కూడా సమర్పించామని చెప్పారు. హైదరాబాద్ ఫార్మాసిటీలోని 2000 ఎకరాల్లో ఈ బల్క్ డ్రగ్ పార్క్ ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు కేంద్రానికి స్పష్టంగా తెలియచేశామన్నారు. ఫార్మాసిటీ మాస్టర్ ప్లాన్ ను కూడా అందచేశామన్నారు. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయాలని 2015లో నిర్ణయం తీసుకున్న నరేంద్ర మోడీ సర్కార్, ప్రతిపాదనల పరిశీలన, ఇతర అంశాల పేరుతో  2021 వరకు టైంపాస్ చేసిందని కేటీఆర్ ఆరోపించారు. తాజాగా ప్రకటించిన జాబితాలో అన్ని సిద్దంగా ఉన్న తెలంగాణకు చోటు దక్కకపోవడం తమను షాక్ గురించేసిందని కేటీఆర్ అన్నారు. దేశ ఫార్మా రంగాన్ని నిజంగా అత్మనిర్భరత వైపు త్వరగా తీసుకుపోవాలన్న కేంద్ర ఉద్దశ్యం పట్ల చిత్తశుద్ది ఉంటే కనీసం మరో రెండు మూడేళ్లు పట్టే ప్రాంతాలకు పార్కుల కేటాయింపు చేసేది కాదన్నారు. తెలంగాణ రాష్ట్రానికి బల్క్ డ్రగ్ పార్క్ ను కేటాయిస్తే వెంటనే పని ప్రారంభించవచ్చన్న కనీస సోయి కేంద్ర ప్రభుత్వానికి లేకపోవడం దేశ ప్రజల దురదృష్టమ‌న్నారు. దేశీయ ఫార్మా రంగాన్ని స్వయం సమృద్ధిగా మార్చాలన్న తమ లక్ష్యానికి కేంద్ర ప్రభుత్వం నిజంగానే కట్టుబడి ఉంటే  తెలంగాణలో వెంటనే బల్క్ డ్రగ్ పార్క్ ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బల్క్ డ్రగ్ పార్కుల కేటాయింపులో తెలంగాణని విస్మరించడమంటే దేశీయ ఫార్మా రంగం పురోగతిని దారుణంగా దెబ్బతీయడమే అని విమర్శించారు. రాజకీయ ప్రజయోజనాల కోసం దేశ ప్రయోజనాలను పణంగా పెట్టొద్దని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు దార్శనిక నాయకత్వంలో హైదరాబాద్ ఫార్మసిటీని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నామన్న కేటీఆర్, బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేసి తమ ప్రయత్నాలకు చేదోడు వాదోడుగా నిలవాలని కేంద్రాన్ని కోరారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement