Wednesday, April 24, 2024

జ‌నంతో మ‌నం – మోడీ కొత్త తంత్రం..

న్యూఢిల్లి : 2024 సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై బీజేపీ ఎంపీలకు ప్రధాని మోడీ దిశానిర్దేశం చేశారు. మంగళవారం ఢిల్లిలో జరిగిన పార్టీ పార్లమెంటరీ సమావేశం జరిగింది. కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తర్వాత బీజేపీ పార్లమెంటరీ పార్టీ తొలిసారి భేటీ అయింది. ఈ సందర్భంగా ఎంపీలను ఉద్దేశించి మోడీ మాట్లాడుతూ, మన పనితీరు పట్ల మెజారిటీ ప్రజలు సంతోషంగా ఉన్నప్పటికీ, మీరు ఆత్మ సంతృప్తి భావన చెందవద్దు. క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరుకోవాలి. ఎంపీలు ఓటర్లకు చేరువైతే, ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఉండదు అని సూచన చేశారు. చాలా సంక్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్న దశలోనూ అన్ని వర్గాలకు మేలుచేసే బడ్జెట్‌ తీసుకొచ్చామని చెప్పారు

వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందు ఇదే చివరి పూర్తిస్థాయి బడ్జెట్‌ అయినప్పటికీ, ఇది ఎన్నికల బడ్జెట్‌అని చెప్పే ధైర్యం ఎవరికీ లేదన్నారు. బడ్జెట్‌లో పేదలు, వెనుకబడిన వర్గాల వారిపైనే దృష్టిసారించామని, సైద్ధాంతికంగా బీజేపీని వ్యతిరేకించే వారుకూడా బడ్జెట్‌ను స్వాగతించారు. ఈ బడ్జెట్‌ను మీరు ప్రజల ముందుకు తీసుకెళ్లాలి. వారికి వివరించి చెప్పాలి. ఇది వారి నియోజకవర్గానికి ఏ విధంగా మేలు చేస్తుందో అవగాహన కల్పించాలి. ప్రపంచం ఆర్థిక సంక్షోభంలో ఉన్న వేళ మన బడ్జెట్‌ వచ్చిన తీరును, ప్రాధాన్యతలను వారితోన పంచుకోవాలి. ఇది ఎంపీలపై ఉన్న బృహత్తర బాధ్యత. అలాగే యువతను సరిహద్దు ప్రజలకు చేరువయ్యేలా పట్టణ ప్రాంత ఎంపీలు క్రీడల కార్యక్రమాల్లో పాల్గొనాలని ప్రధాని సూచించారు. 2014, 2019 ఎన్నికల్లో మెజారిటీ విజయం సాధించినప్పటికీ, ప్రభుత్వం చేస్తున్న కృషి వల్ల ప్రజల్లో అసంతృప్తి లేదా వ్యతిరేకత కనిపించే అవకాశం ఉండబోదని, ప్రతి ఒక్కరు క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని మోడీ చెప్పారు. జీ20 సమావేశాల కోసం భారత్‌కు వస్తున్న విదేశీ అతిథులు ఇక్కడి ఏర్పాట్లను ప్రశంసిస్తున్నారని ప్రధాని చెప్పారు.

గతనెలలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గంలో కూడా మోడీ లోక్‌సభ ఎన్నికల సన్నద్ధతకు పిలుపునిచ్చారు. మనకు 400రోజుల సమయం ఉంది. ఇప్పటి నుంచి ప్రజల్లోనే ఉండండి. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయండి అని పిలుపునిచ్చారు. ఎన్నికల సమీకరణలతో పనిలేకుండా సమాజంలోని ప్రతి వర్గానికి చేరువ కావాలని సూచించారు. బీజేపీ ఇకపై రాజకీయ ఉద్యమం కాదని, సామాజిక ఉద్యమపార్టీ అని నొక్కిచెప్పారు. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలని బీజేపీ పట్టుదలతో ఉన్నది. ప్రభుత్వ వ్యతిరేక సెంటిమెంట్‌ను అధిగమించేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement