Thursday, April 25, 2024

మహిళా రిజర్వేషన్లపై ఎమ్మెల్సీ కవిత రౌండ్ టేబుల్ సమావేశం..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: మహిళా రిజర్వేషన్ల బిల్లులో ‘కోటా’లో ‘కోటా’ అమలు చేయాల్సిందేనని ఉత్తరాదికి చెందిన పలు రాజకీయ పార్టీలు అభిప్రాయపడ్డాయి. మహిళా రిజర్వేషన్ బిల్లుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన పలువురు నేతలు మహిళా రిజర్వేషన్లలో అంతర్భాగంగా ఇతర రిజర్వేషన్లను అమలు చేయాలని సూచించారు. ఈ సమావేశానికి 13 రాజకీయ పార్టీలు, వివిధ ప్రజా, మహిళా సంఘాల నేతలు, విద్యార్థులు హాజరై మద్దతు పలికారు. మహిళా బిల్లు ఆడవారికే కాక దేశానికి కూడా ఎంతో మేలు చేస్తుందని అభిప్రాయపడ్డారు. బుధవారం న్యూఢిల్లీలోని లీ మెరిడియన్ హోటల్లో ‘భారత జాగృతి’  అధ్యక్షురాలు కవిత నేతృత్వంలో నిర్వహించిన రౌండ్ సమావేశానికి బీఆర్ఎస్ ఎంపీలు మాలోత్ కవిత, జోగినపల్లి సంతోష్ కుమార్, కొత్త ప్రభాకర్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి), పసునూరి దయాకర్, వెంకటేశ్ నేత సహా పలువురు పార్టీ నేతలు కూడా ఈ భేటీలో భాగమయ్యారు.

తొలుత సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రసంగంతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ప్రారంభించగా.. 27 ఏళ్లుగా అమలుకు నోచుకోని మహిళా రిజర్వేషన్ల బిల్లుపై ముందుకొచ్చిన కవితను నారాయణ ప్రశంసించారు. మహిళా బిల్లు కోసం సాగించే పోరాటంలో తమ పార్టీ మద్ధతు ఉంటుందని అన్నారు. అనంతరం శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది మాట్లాడుతూ.. ఓటు వేయడంలో రాజ్యాంగ నిర్మాతలు మహిళలకు సమాన హక్కు కల్పించినప్పుడు, చట్టసభల్లో మహిళల ప్రాతినిథ్యం పెంచడానికి అధికారంలో ఉన్న ప్రభుత్వం మహిళలకు ఎందుకు రిజర్వేషన్ కల్పించడం లేదని ప్రశ్నించారు. ఈ అంశంపై చట్టసభల్లో ఉన్న మహిళలు ప్రభుత్వాలను మరింతగా డిమాండ్ చేయాలని సూచించారు. ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా మాట్లాడుతూ… రిజర్వేషన్ బిల్లుకు తాము మద్ధతిస్తామని ప్రకటించారు. అయితే, రిజర్వేషన్ లో రిజర్వేషన్ కోటా ఉండాలని ప్రతిపాదించారు. పార్లమెంటుతో పాటు పార్లమెంట్ వెలుపల కూడా లేవనెత్తాల్సిన అంశాలపై ప్రజా ఉద్యమాలను మరింత ఉధృతంగా నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు.

- Advertisement -

సీపీఐ ఎంపీ బినోయ్ బిశ్వం మాట్లాడుతూ… మహిళా రిజర్వేషన్ బిల్లుకు పితృస్వామ్య వ్యవస్థలు అడ్డొచ్చాయని విమర్శించారు. 21వ దశాబ్దంలో కూడా మహిళా హక్కులను అడ్డుకోవడం సరికాదని సూచించారు. కల్వకుంట్ల కవిత ప్రారంభించిన ఈ ఉద్యమంలో తాము భాగస్వాములవుతామని ప్రకటించారు. ఆర్ఎల్డీ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు ప్రతిభా సింగ్, ఆ పార్టీ నేత భూపేంద్ర చౌదరి మాట్లాడుతూ…. రిజర్వేషన్లపై మహిళల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ముఖ్యంగా బిల్లుపై జరుగుతున్న చర్చల గురించి గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు అవగాహన లేదని చెప్పారు.

జేఎంఎం ఎంపీ మౌవా మాఝి మాట్లాడుతూ…. ఒకవైపు ఆజాదీ కా అమృత్ మహోత్సవం జరుపుకుంటున్న ఈ తరుణంలో చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం తక్కువ ఉండడం మంచిగా అనిపించడం లేదని అన్నారు. చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యం కోసం రిజర్వేషన్ బిల్లు రావాల్సిందేనని, ఇందుకోసం కవిత చేస్తున్న పోరాటానికి తాము అండగా ఉంటామని తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్ద మాట్లాడుతూ…. మహిళా రిజర్వేషన్ల కోసం కవిత లేవనెత్తిన డిమాండ్ కు తాము సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఉందని, ఆ మెజారిటీని సంస్కరణల కోసమే కాదు, ప్రజలకు మంచి చేసే బిల్లులను తీసుకురావడానికి కూడా ఉపయోగించాలని సూచించారు.

సమాజ్‌వాది పార్టీ ఎంపీ ఎస్టీ హసన్ మాట్లాడుతూ… మహిళలకు తగిన వాట కల్పించకుండా, గౌరవం ఇవ్వకుండా ఏ దేశం కూడా సూపర్ పవర్ కాబోదని స్పష్టం చేశారు. దేశం అభివృద్ధి కావాలంటే చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యం పెరగాలని అన్నారు. వీసీకే ఎంపీ తిరుమావలవన్ మాట్లాడుతూ… మహిళా రిజర్వేషన్ బిల్లు తక్షణ అవసరమని తెలిపారు. ఆలస్యం చేస్తే దేశానికి , ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది అని స్పష్టం చేశారు. డీఏంకే ఎంపీ తమిళ్ సై తంగపంద్యాన్ మాట్లాడుతూ… వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడంలో మహిళల భాగస్వామ్యం అవసరమని పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కార్యరూపం దాల్చడానికి కవిత చేసే పోరాటంలో తాము కలిసి నడుస్తామని అన్నారు. ఈ సందర్భంగా సమావేశానికి హాజరైన విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు ఎంపీలు సమాధానాలిచ్చారు.

పార్టీలను ఏకం చేస్తాం : ఎంపీ మాలోత్ కవిత
ఎన్నికలకు ముందు మహిళా బిల్లు పేరు చెప్పి రెండుసార్లు బీజేపీ అధికారం చేపట్టిందని ఎంపీ మాలోత్ కవిత గుర్తు చేశారు. మెజారిటీ ఉన్నా ఆ ఊసే ఎత్తట్లేదని ఆరోపించారు. తమ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ మహిళలకు ఎంతో ప్రాధాన్యతనిస్తున్నారని అన్నారు. పార్లమెంట్‌లో ఎంపీగా అడుగు పెట్టిన తొలి బంజారా మహిళ తానేనని కవిత సగర్వంగా చెప్పారు. మహిళా బిల్లు ఉద్యమంలో తామంతా భాగస్వాములవుతామని కవిత స్పష్టం చేశారు. లైక్ మైండెడ్ పార్టీలను ఏకం చేస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

కేంద్రంపై ఒత్తిడి పెంచాలి: కవిత

రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనంతరం ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం పోరాటంలో భాగంగా తొలుత జంతర్ మంతర్ వద్ద ధర్నా చేశామని, బుధవారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి 13 పార్టీల నుంచి ఎంపీలు హాజరయ్యారని అన్నారు. అన్ని రాజకీయ పార్టీలను కలుపుకుని పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. ఈ క్రమంలో పొరుగు రాష్ట్రాల్లోని వైఎస్సార్సీపీ, తెలుగుదేశం పార్టీలను సంప్రదించారా అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ఇప్పటి వరకు సంప్రదించలేదని తెలిపారు. మహిళా రిజర్వేషన్ల బిల్లుపై పోరాటం మహిళగా తనకు దక్కిన గౌరవంగా భావిస్తానన్నారు. పార్లమెంటు లోపలా, వెలుపలా అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించామని అన్నారు. ప్రైవేట్ మెంబర్ బిల్లుతో పాటు వాయిదా తీర్మానం నోటీసులు, స్పెషల్ మెన్షన్, జీరో అవర్.. ఇలా ఏ అవకాశం దొరికితే ఆ అవకాశాన్ని వినియోగించుకుంటూ మహిళా రిజర్వేషన్ల బిల్లు కోసం ఒత్తిడి పెంచుతామని చెప్పారు. తమ పోరాటానికి కాంగ్రెస్ కూడా సహకరించాలని కవిత కోరారు. ధరణిలో సగం-ఆకాశంలో సగం-అవకాశాల్లో సగం తమ నినాదమని ఆమె చెప్పారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement