Thursday, April 25, 2024

లాక్ డౌన్ పెడతా: విశ్వసుందరిగా ఆండ్రియా మేజా..

విశ్వ సుందరి కిరీటం ఈసారి మెక్సికోను వరించింది. ఆదివారం రాత్రి అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న హాలీవుడ్ లో విశ్వ సుందరి గ్రాండ్ ఫినాలె జరిగింది. మిస్ యూనివర్స్ 2020గా మిస్ మెక్సికో యాండ్రియా మేజా జయకేతనం ఎగురవేసింది. మాజీ విశ్వ సుందరి జోజిబినీ టుంజీ (దక్షిణాఫ్రికా).. ఆమెకు కిరీటాన్ని అలంకరించింది. .అందాల పోటీల నిర్వాహకులు ఆమెను కరోనాపై ప్రశ్నను సంధించారు. ‘‘నువ్వే మీ దేశానికి నాయకురాలివైతే కరోనా మహమ్మారిని ఎలా ఎదుర్కొనేదానివి?’’ అనే ప్రశ్న అడిగారు. దానికి ఆమె సూటిగా ‘లాక్ డౌన్’ పెట్టేదాన్నంటూ సమాధానమిచ్చింది.‘‘కరోనా మహమ్మారి లాంటి అతి క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొనేందుకు కచ్చితమైన పరిష్కారమంటూ లేదని నేననుకుంటున్నాను. కరోనాను ఎదుర్కోవాల్సి వస్తే నేను లాక్ డౌన్ పెట్టేదాన్ని. ప్రాణాలు పోకముందే ఆ నిర్ణయాన్ని తీసుకునేదాన్ని. ఇప్పటికే మేం చాలా మందిని కోల్పోయాం. లాక్ డౌన్ ను మేం తట్టుకోలేమనే విషయం తెలుసు. కానీ, ప్రజల రక్షణకే ప్రాధాన్యం ఇవ్వాలి. కాబట్టి ముందు నుంచీ నేను ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతూనే ఉన్నాను’’ అని ఆండ్రియా చెప్పుకొచ్చింది.

భారత్ తరఫున బరిలో నిలిచిన ఏడ్లిన్ కేస్టలీనో నాలుగో స్థానంలో నిలిచింది. మిస్ దివా యూనివర్స్ 2020 కిరీటం ఆమెను వరించింది. విశ్వ సుందరి రన్నరప్ గా మిస్ బ్రెజిల్ జూలియా గామా, రెండో రన్నరప్ గా మిస్ పెరూ జానిక్ మాచెటా డెల్ కాస్టిలో నిలిచింది. మొత్తంగా మిస్ యూనివర్స్ పోటీల్లో 73 మంది సుందరాంగులు తమ అందచందాలతో పోటీ పడ్డారు. వాస్తవానికి గత ఏడాదే జరగాల్సిన మిస్ యూనివర్స్ పోటీలు కరోనా కారణంగా ఏడాది పాటు వాయిదా పడ్డాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement