Sunday, October 6, 2024

TG | ప్రజలతో మంత్రుల ముఖాముఖీ.. కొత్త కార్యక్రమానికి శ్రీకారం !

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌ గౌడ్‌ సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. తాను పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత నాయకులు – కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ మన్ననలు పొందుతున్నారు. ప్రజాపాలన – ఇందిరమ్మ పాలన సాధనే లక్ష్యంగా ముఖ్యమంత్రి ఎ రేవంత్‌ రెడ్డితో పాటు అడుగులు వేస్తున్నారు.

ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం పొద్దుపోయే వరకు కార్యకర్తలకు గాంధీభవన్‌లో అందుబాటులో ఉంటున్నారు. పార్టీ, గాంధీభవన్‌, కార్యకర్తలు లేకుండా ప్రభుత్వమే లేదని, కార్యకర్తలకు మంత్రులు అందుబాటులో ఉండాలని చేసిన సూచనల మేరకు బుధవారం నుంచి మంత్రులు గాంధీభవన్‌లో కార్యకర్తలకు అందుబాటులో ఉండబోతున్నారు. ఈ మేర‌కు షెడ్యూల్‌ను ఖరారు చేశారు.

ప్రతి బుధ, శుక్రవారాలు మంత్రులు గాంధీభవన్‌ రానున్నారు. పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ప్రతి వారం ఇద్దరు మంత్రులు, నెలకోసారి ముఖ్యమంత్రి గాంధీభవన్‌కు వచ్చి ప్ర‌జ‌లు, పార్టీ కార్యకర్తల కష్టసుఖాలు తెలుసుకునేందుకు షెడ్యూల్‌ ఖరారు చేయాలని మహేష్‌కుమార్‌ గౌడ్‌ చేసిన సూచనలను సీఎం రేవంత్‌ రెడ్డి అంగీకరించిన విషయం తెలిసిందే.

గత శుక్రవారం నుంచే ఈ ముఖాముఖి కార్యక్రమం ప్రారంభం కావాల్సి ఉండగా మంత్రి వర్గ సమావేశం ఉన్నందున వాయిదా పడింది. వాయిదా పడిన ఈ కార్యక్రమం ఈ బుధవారం నుంచే మొదలుకానుంది. ఈ నెలతో పాటు అక్టోబర్‌ నెలలో మంత్రుల ముఖాముఖి షెడ్యూల్‌ కూడా ఖరారైంది.

ఈ నెల 25న బుధవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ రానున్నారు. 27న డి శ్రీధర్‌ బాబు, అక్టోబర్‌ 4న ఎన్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, 9న పొన్నం ప్రభాకర్‌, 11న డి అనసూయ సీతక్క, 16న కోమటిరెడ్డి వెంకటరెడ్డి, 18న కొండా సురేఖ, 23న పొంగులేటి శ్రీనివాసరెడ్డి, 25న జూపల్లి కృష్ణారావు, 30న తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం నీటి పారుదల శాఖ మంత్రి ఎన్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి కార్యకర్తలతో మమేకం అవుతారు.

- Advertisement -

ఈ మేరకు మంత్రుల షెడ్యూల్‌ ఖరారైంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మంత్రులు అందుబాటులో ఉంటారు. పార్టీ పరంగా సమస్యలను వింటారు. ఫిర్యాదులు స్వీకరిస్తారు. ఇందు కోసం ఇందిరాభవన్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. కార్యకర్తలు కూర్చునేందుకు వీలుగా తాత్కాలికంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement